కల్వకుర్తి, మే 17 : పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనులు కేసీఆర్ ప్రభుత్వంలో 90 శాతం పూర్తయ్యాయని, మిగిలిన 10 శాతం పూర్తి చేయడంలో రేవంత్‌రెడ్డి ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడం సిగ్గుచేటని కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్ ధ్వజమెత్తారు. శనివారం నాగర్‌కర్నూల్ జిల్లా కల్వకుర్తిలోని ఆయన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జైపాల్ మాట్లాడారు. కల్వకుర్తి ప్రాంతానికి చెందిన మాజీ కేంద్ర మంత్రి జైపాల్‌రెడ్డి పేరును పాలమూరు-రంగారెడ్డి పథకానికి పెట్టి చివరి దశలో ఉన్న పనులపై శ్రద్ధ పెట్టకపోవడం చూస్తుంటే ఉద్దేశపూర్వకంగానే నిర్లక్ష్యం చేస్తున్నారని అర్థమవుతున్నదని తెలిపారు.
కల్వకుర్తిలో జైపాల్‌రెడ్డి విగ్రహావిష్కరణ సభలో తనకు రాజకీయ జన్మనిచ్చిన కల్వకుర్తిని అభివృద్ధి పథంలో ముందంజలో ఉంచుతానని సీఎం రేవంత్ ప్రకటించినా.. నేటికీ కొత్త పనులకు నయాపైసా కేటాయించకపోవడం విడ్డూరంగా ఉందని చెప్పారు. కేసీఆర్ హయాంలోనే కల్వకుర్తికి 100 పడకల దవాఖాన, ట్రామాకేర్ సెంటర్ మంజూరైందని గుర్తుచేశారు. నిధులు కేటాయిస్తే పనులు ప్రారంభమవుతామని తెలిపారు. కొడంగల్‌కు మెడికల్ కళాశాల, నారాయణపేట-కొడంగల్‌కు పీఆర్ఎల్ఐ ద్వారా సాగునీళ్లు అందించేందుకు రూ.4 వేల కోట్లు కేటాయించారని, పుట్టినగడ్డ ఏం పాపం చేసిందని ప్రశ్నించారు. కల్వకుర్తికి మెడికల్, ఇంజినీరింగ్ కళాశాలలు మంజూరు చేయడంతోపాటు పారిశ్రామికంగా అభివృద్ధి చేయాలని డిమాండ్ చేశారు.