బిచ్కుంద, జూన్ 21 : కామారెడ్డి జిల్లా జుక్కల్ మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే వినూత్న రీతిలో నిరసన తెలిపారు. బిచ్కుంద పట్టణంలో సెంట్రల్ లైటింగ్, రోడ్డు విస్తరణ పనులు వెంటనే పూర్తి చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి బస్టాండు వద్ద ప్రధాన రహదారిపై ఏర్పడిన మోకాల్లోతు గుంతల్లో నిలిచిన బురదనీటిలో కూర్చొని ఆదివారం నిరసన వ్యక్తంచేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రోడ్డు విస్తరణ పనులు చేపట్టారని, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి రెండున్నరేండ్లు గడుస్తున్నా ఇప్పటివరకు పనులు పూర్తిచేయడం లేదని మండిపడ్డారు. స్థానిక ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు అభివృద్ధిని పూర్తిగా విస్మరించారని ఆరోపించారు. శనివారం కురిసిన చిన్నపాటి వర్షానికే రోడ్డుపై ఏర్పడిన భారీ గుంతల్లో నీరు నిలిచి వాహనదారులు గాయాలపాలవుతున్నారని తెలిపారు. సెంట్రల్ లైటింగ్, రోడ్డు విస్తరణ పనులు పది రోజుల్లో ప్రారంభించకపోతే నిరాహార దీక్ష చేపడుతామని హెచ్చరించారు.