Boga Sravani | జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌పై మాజీ మున్సిపల్ చైర్పర్సన్, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు భోగ శ్రావణి సంచలన ఆరోపణలు చేశారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో శుక్రవారం ఆమె మీడియా సమావేశం నిర్వహించారు. పట్టణంలో సంచలనంగా మారిన రూ.100 కోట్ల భూకబ్జా ఆరోపణలపై ఆమె స్పందించారు. తాను మున్సిపల్ చైర్పర్సన్ గా ఉన్నప్పుడు పెట్రోల్ పంపు భూ కబ్జా విషయంపై మాట్లాడితే తనను టార్గెట్ చేశారన్నారు. మున్సిపల్ చైర్పర్సన్ పదవికి రాజీనామా చేయడానికి పెట్రోల్ పంపు వ్యవహారణమే కారణమని తెలిపారు. గతంలో రెండు మూడు సందర్భాల్లో రాజీనామాకు ముందు.. ఆ తర్వాత కూడా మున్సిపల్ భూమి కబ్జాతో పాటు పెట్రోల్ పంప్ వ్యవహారంపై మీడియా సమావేశంలో ఏర్పాటు చేసి ప్రస్తావించినట్లు గుర్తు చేశారు.
యావర్ రోడ్డు విస్తరణకై తొలి ప్రయత్నంగా మాస్టర్ ప్లాన్ ప్రకారం డివైడర్ నిర్మిస్తున్న సందర్భంలో ఐదు ఫీట్లు ఆర్అండ్బీ ఆఫీస్ సైడ్ అలైన్మెంట్ చేయించినట్లు తెలిపారు. మాస్టర్ ప్లాన్ ప్రకారం డివైడర్ కడితే పెట్రోల్ పంపు విషయం బయటకు వస్తుందని తనపై ఒత్తిడి తెచ్చారని ఆరోపించారు. ఓ దశలో మొదలుపెట్టిన డివైడర్ నిర్మాణాన్ని సైతం మార్చి కట్టేలా చేశారని.. కబ్జాలకు పాల్పడిన వారిని కాపాడేందుకు ఎమ్మెల్యే సంజయ్ కుమార్ తనను నడిరోడ్డుపై నిలబెట్టి.. ఇది మా వ్యక్తిగత విషయమని.. ఈ విషయంలో నువ్వు తలదూర్చొద్దంటూ ఒత్తిడి తీసుకువచ్చారన్నారు. పెట్రోల్ పంప్‌కి అన్ని అనుమతులు ఉన్నట్లయితే ఆ రోజు తనపై ఎమ్మెల్యే సంజయ్ తనపై ఒత్తిడికి తీసుకురావడానికి కారణం ఏంటని ఆమె ప్రశ్నించారు.
అన్ని నిజాలు తెలిసినా ఎమ్మెల్యే సంజయ్ తెర వెనుక రాజకీయాలు చేస్తున్నారన్నారు. 1948 సెప్టెంబర్ 17న నిజాం పాలనా ముగిసి.. 1949 ఇండియన్ స్టాంప్ యాక్ట్ అమల్లోకి వస్తే 1952లో అసలు అమలులో లేని కిబాల ద్వారా స్థలం ఎలా కొన్నారో అర్థంకావడం లేదన్నారు. ఈ విషయంలో ఇప్పటికే అధికారులపై రాజకీయ ఒత్తిడి ఉందని.. సందేహాత్మకంగా ఉన్న కిబాల పత్రాన్ని అందరి సమక్షంలో ట్రాన్స్‌లేట్ చేయించే విధంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ను కోరారు. తాను చైర్‌పర్సన్‌గా ఉన్నప్పుడు ఈ వ్యవహారానికి సంబంధించి ఎలాంటి రికార్డులు మున్సిపల్లో లభించలేదని తెలిపారు. 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న జీవన్ రెడ్డి ఇప్పటికైనా ఈ వ్యవహారంపై మాట్లాడడం హర్షించదగ్గ విషయమన్నారు.
మున్సిపల్ ప్రభుత్వ భూముల రక్షణకై పార్టీలకు అతీతంగా కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. అవసరమైతే మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఆధ్వర్యంలో జేఏసీ ఏర్పాటు చేయాల్సిందిగా కోరారు. ప్రజల ఆస్తి ప్రజలకు చెందేలా చేయాలని ఇందుకు నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ అన్న సహకారం ఉంటుందని తెలిపారు. ఇటీవల అర్బన్ ఇన్ఫ్రా డెవలప్మెంట్ ఫండ్స్ కేంద్ర ప్రభుత్వం మంజూరు చేస్తే స్థానిక ఎమ్మెల్యే తానే తీసుకువచ్చినట్లుగా చెప్పుకోవడం సిగ్గుచేటు అన్నారు. జగిత్యాలను ఎడ్యుకేషనల్ హబ్‌గా మార్చేందుకు ఎంపీ అరవింద్ కృషి చేస్తున్నారని, అందులో భాగంగానే జగిత్యాలకు కేంద్రీయ విద్యాలయాన్ని తీసుకువచ్చారన్నారు.