హైదరాబాద్, జూన్21 (నమస్తే తెలంగాణ): బీఆర్ఎస్ పార్టీలోకి మహారాష్ట్ర నుంచి భారీగా చేరికలు కొనసాగుతున్నాయి. బుధవారం పలువురు ప్రముఖులు బీఆర్ఎస్లో చేరారు. మహారాష్ట్రకు చెందిన విశ్రాంత ఐపీఎస్ అధికారి, మహారాష్ట్ర ఐజీగా పనిచేసిన విఠల్ జాదవ్తోపాటు మహారాష్ట్ర సినీ రంగానికి చెందిన ప్రఖ్యాత నృత్యకళాకారిణి సురేఖ పుణెకర్, సామాజిక కార్యకర్త శేఖర్ అంబేకర్, ఉమాకాంత్ మంగ్రూలే, లాతూర్, ఉస్మానాబాద్ జిల్లాల నుంచి ఆమ్ఆద్మీపార్టీకి చెందిన జిల్లా అధ్యక్షులు, గ్రామ సర్పంచులు, పలువురు రాజకీయ నాయకులు, బీజేపీకి చెందిన ప్రముఖులు బీఆర్ఎస్లో చేరారు. వారందరికీ సీఎం కేసీఆర్ గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి స్వాగతించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. తెలంగాణలో రైతు సర్కార్ అధికారంలోకి రావటం వల్లే తొమ్మిదేండ్ల అనతికాలంలో రాష్ట్రం అన్నిరంగాల్లో అభివృద్ధి చెంది దేశానికే ఆదర్శంగా నిలిచిందని చెప్పారు. తాను స్వయంగా రైతుబిడ్డ కావటం వల్లే కిసాన్ సర్కార్ నినాదాన్ని దేశ రాజకీయాల్లోకి తీసుకొచ్చానని స్పష్టం చేశారు.
పోరుతప్ప దారిలేదా?
జీవితాలు బాగుపడాలంటే, హక్కులు సాధించుకోవాలంటే పోరు తప్ప మరోమార్గం లేనట్టుగా దేశంలో పరిస్థితి తయారైందని సీఎం కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలో రైతు తన వ్యవసాయ పనులు వదిలిపెట్టి ఆందోళనలతో రోడ్డెక్కాల్సిన అవసరం రాకుండా.. ప్రభుత్వాన్ని తామే ఏర్పాటు చేసుకోవాలని పిలుపునిచ్చారు. మన ఓటు మనకే అనే చైతన్యంతో అబ్కి బార్ కిసాన్ సర్కార్ నినాదాన్ని నిజం చేసేందుకు దేశ రైతాంగమంతా బీఆర్ఎస్ పార్టీతో కలసి నడవాలని పునరుద్ఘాటించారు. తప్పుడు ధోరణులను అవలంబిస్తున్న దేశ రాజకీయాల్లో సమూల మార్పులు రావాల్సిన అవసరమున్నదని చెప్పారు. రాజకీయ పార్టీలు మూస ధోరణులకు భిన్నంగా ఆలోచించినప్పుడే ఈ దేశంలో గుణాత్మక అభివృద్ధి సాధ్యమవుతుందని స్పష్టం చేశారు. దేశ ప్రజలు మార్పును ప్రగాఢంగా కోరుకుంటున్నారని తెలిపారు. మనది వ్యవసాయాధారిత దేశమని, 42 శాతం రైతులున్నారని చెప్తూ మన ఓటు మనమే వేసుకుంటే మన ప్రభుత్వమే ఏర్పాటవుతుందని చెప్పారు. ఎవరికో ఓట్లు వేసి మన కష్టాలు తీర్చమంటే వారెందుకు తీరుస్తారని ప్రశ్నించారు. కాంగ్రెస్ను దింపి బీజేపీని గద్దెనెక్కించటం వల్ల దేశ రైతాంగం ఏం సాధిస్తున్నది? అని అడిగారు. మహారాష్ట్రలో తెలంగాణ మాడల్ పాలన తెస్తే దివాళా తీస్తామని ఆ రాష్ర్టానికి చెందిన బీజేపీ తదితర నేతలు చేస్తున్న ప్రకటనలను సీఎం కేసీఆర్ తిప్పికొట్టారు.
మహారాష్ట్రకు అద్భుత సహజవనరులు
గోదావరి కృష్ణా నదుల జన్మ స్థానమైన మహారాష్ట్ర అద్భతమైన సహజవనరులున్న రాష్ట్రమని సీఎం కేసీఆర్ అన్నారు. ధనిక రాష్ట్రమైన మహారాష్ట్రను అకడి పాలకుల అసమర్థత కారణంగా వెనక్కు నెటేశారని ఆవేదన వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే..ఉచితంగా తాగునీరు సాగునీరు సహా రెండేండ్లలో 24 గంటలు నిరంతరాయ ఉచిత నాణ్యమైన విద్యుత్తును మహారాష్ట్ర రైతులకు అందచేస్తామని పునరుద్ఘాటించారు. మహారాష్ట్రలో బీఆర్ఎస్ సభ్యత్వం ఇప్పటికే పది లక్షలకు చేరుకున్నదని మరికొన్ని నెలల్లో యాభై లక్షలకు చేరుకొంటుందని మహారాష్ట్రకు చెందిన సీనియర్ నేతలు ఈ సందర్భంగా సీఎం కేసీఆర్కు వివరించారు. ఈ కార్యక్రమంలో మహారాష్ట్ర బీఆర్ఎస్ నేతలు శంకరన్న దోంగ్డే, మాణిక్ కదం.. తదితరులు పాల్గొన్నారు.