హనుమకొండ, మే 3 : వరంగల్ వేదికగా 2022 మే 6న కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్‌గాంధీ చేసిన రైతు డిక్లరేషన్ పచ్చి మోసమని ప్రభుత్వ మాజీ చీఫ్ విప్ దాస్యం వినయ్‌భాస్కర్ అన్నారు. హనుమకొండ హంటర్‌రోడ్డులో ఈ నెల 6న నిర్వహించనున్న రైతు సంగ్రామ సదస్సు వేదిక వద్ద ఆదివారం మాజీ ఉప ముఖ్యమంత్రి తాటికొండ రాజయ్య, మాజీ ఎమ్మెల్యే అరూరి రమేశ్, బీఆర్ఎస్ పార్టీ శ్రేణులతో కలిసి రైతు సదస్సు పోస్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వినయ్‌భాస్కర్ మీడియాతో మాట్లాడుతూ.. అలవికాని హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ రైతులకు మోసగించిందని ఆరోపించారు. అధికారంలోకి వచ్చి రెండున్నరేండ్లు గడిచినా 420 హామీలు, 6 గ్యారెంటీల్లో ఏ ఒకటీ అమలు చేయలేదని విమర్శించారు. రైతు పక్షపాతి కేసీఆర్ రాష్ట్ర ఏర్పాటు అనంతరం వ్యవసాయన్ని పండుగ చేసి దేశంలోనే తెలంగాణను ఆదర్శంగా నిలిపారని కొనియాడారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన రైతు వేదికలు నిరుపయోగంగా మారాయని అన్నారు.
‘కేసీఆర్ రూ.10వేల రైతు భరోసా ఇస్తున్నారు.. మేము అధికారంలోకి వస్తే రూ. 15వేలు ఇస్తాం’ అని చెప్పిన రేవంత్‌రెడ్డి మూడుసార్లు ఎగ్గొట్టాడని దుయ్యబట్టారు. బోనస్ పక్కనపెడితే పండిన పంటను కొనుగోలు చేసే పరిస్థితిలో కాంగ్రెస్ సర్కార్ లేదని ధ్వజమెత్తారు. రెండున్నరేండ్లలో తెలంగాణలో విధ్వంసం జరిగిందని అన్నారు. మళ్లీ తెలంగాణ పునఃనిర్మాణం కేసీఆర్‌తోనే సాధ్యమని అన్నారు. సదస్సు నిర్వహిస్తామంటే బీఆర్ఎస్కు అనుమతి ఇవ్వరు.. కానీ, ఏం చేశారని తమకు పోటీగా రైతు మేళా నిర్వహిస్తున్నారని ప్రశ్నించారు. రైతాంగాన్ని, ప్రజలను డైవర్ట్ చేసేందుకు కాంగ్రెస్ రాజకీయం చేస్తున్నదని మండిపడ్డారు. రైతులకు డిక్లరేషన్ పేరుతో ఇచ్చిన హామీలు అమలు చేయకుండా మోసం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి గుర్తుచేసేందుకు రాహుల్‌గాంధీ డిక్లరేషన్ ప్రకటించిన వరంగల్‌లో బీఆర్ఎస్ రైతు సంగ్రామ సదుస్సు నిర్వహిస్తున్నట్టు చెప్పారు. ఈ సదస్సుకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముఖ్యఅతిథిగా హాజరవుతారని తెలిపారు.
బీఆర్ఎస్ను చూస్తే కాంగ్రెస్‌కు వణుకు
బీఆర్ఎస్ పార్టీని చూస్తుంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి భయం పట్టుకున్నదని మాజీ ఉపముఖ్యమంత్రి తాటికొండ రాజయ్య అన్నారు. మాజీ సీఎం కేసీఆర్ బయటకు వస్తే ఆ పార్టీ నేతలకు గుబులు పుడుతున్నదని చెప్పారు. బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రైతు సంగ్రామ సదస్సు పెడుతుంటే.. పోటీగా కాంగ్రెస్ రైతుమేళాతో సభ పెట్టడమేంటని ప్రశ్నించారు. కాంగ్రెస్ నిర్వహిస్తున్న రైతు మేళాలు ప్రజలను మోసం చేయడానికేనని విమర్శించారు. కాంగ్రెస్ రైతుమేళా కాదు.. వారిది బ్యాండు మేళం అని ఎద్దేవా చేశారు. మాజీ ఎమ్మెల్యే అరూరి రమేశ్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను అన్ని రకాలు ఇబ్బందులకు గురిచేస్తున్నదని తెలిపారు. రైతుల సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలమైందని అన్నారు. రైతు రుణ విముక్తి కమిషన్ మాజీ చైర్మన్ నాగుర్ల వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల అమలుపై బీఆర్ఎస్ పార్టీ చర్చకు సిద్ధంగా ఉన్నదని తెలిపారు. విత్తనాలు, ఎరువులు అందించడంలో ప్రభుత్వం విఫలమైందని మండిపడ్డారు.