వరంగల్ : సీఎం కేసీఆర్ (CM KCR ) తెలంగాణలోని పురాతన ఆలయాలకు పూర్వ వైభవం తీసుకోచ్చేందుకు అనేక చర్యలు తీసుకుంటున్నారని రాష్ట్ర పంచాయతీరాజ్ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు (Minister Errabelli) అన్నారు. వరంగల్ (Warangal ) జిల్లా రాయపర్తి మండలం తిరుమలాయపల్లి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో స్వామి వారి విగ్రహ ప్రతిష్టాపనోత్సవం శ్రీ శ్రీ శ్రీ త్రిదండి చినజీయర్ స్వామి(Chinna Jeeyar Swami,) చేతుల మీదుగా బుధవారం అత్యంత వైభవంగా జరిగింది.
యంత్ర ప్రతిష్ఠాపన, మూర్తి స్థాపన, ప్రాణ ప్రతిష్ఠ, ధ్వజ స్తంభ, ఆలయ గోపురం ప్రతిష్ఠ, ఆశీర్వచనం, తీర్థ ప్రసాదాల వితరణ చేపట్టారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..శ్రీ త్రిదండి చిన్న జీయర్ స్వామి పాద స్పర్శ తో తిరుమలాయ పల్లె గ్రామం పావనం అయిందని అన్నారు. సీఎం కేసీఆర్ (CM KCR ) దయవల్ల తెలంగాణలోని దేవాలయాలు అన్నీ పూర్వ వైభవాన్ని సంతరించుకున్నాయని పేర్కొన్నారు.
నాంచారిమడూరు, సన్నూరు, పాలకుర్తి, బమ్మెర, వల్మీడి తదితర గ్రామాలలో గుడులన్నింటికీ పూర్వ వైభవం తీసుకువచ్చేందుకు కృషి చేస్తానని వెల్లడించారు. ఆలయానికి ప్రభుత్వం నుంచి రూ.50 లక్షల వరకు మంజూరు చేయించానని, మరో రూ.50 లక్షల నిధులు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నానని మంత్రి వివరించారు . సీఎం కేసీఆర్ పరిపాలనలో ప్రజలంతా సుఖ సంతోషాలతో, శాంతి సౌఖ్యాల తో ఉండాలని, కేసీఆర్ పరిపాలన సుదీర్ఘంగా సాగాలని దేవుణ్ని కోరుకున్నానని మంత్రి తెలిపారు.
శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన జీయర్ స్వామి మాట్లాడుతూ ప్రతిష్ఠాపన పూర్తి కావడంతో ఇక శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారు ప్రజలకు దర్శనం ఇస్తారని చెప్పారు. కొత్త ప్రభుత్వం వచ్చాక దేవాలయాల జీర్ణోద్ధరణ, పునరుద్ధరణ బాగా జరిగిందని అన్నారు.