గజ్వేల్, జూలై 24: ‘వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచేందుకు అబద్ధ్దాలు ఆడండి’ అని సిద్దిపేట డీసీసీ అధ్యక్షుడు, గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే తూంకుంట నర్సారెడ్డి పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. బుధవారం గజ్వేల్‌లో నిర్వహించిన కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది.
‘మనం రేపు గెలిచేందుకు నాలుగు కాదు, ఆరు కాదు, ఎనిమిది అబద్ధ్దాలు ఆడండి.. మన ప్రభుత్వం ఇంకా మూడేండ్లు అధికారంలో ఉంటది’ అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. గెలిచేందుకు ఎన్నైనా అబద్ధ్దాలు ఆడాలని కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడటంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఆరు గ్యారెంటీలు, అనేక హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌పై ఇప్పటికే రాష్ట్రంలో ప్రజలు గుర్రుగా ఉన్న సంగతి తెలిసిందే. మళ్లీ అబద్ధాలు ఆడి స్థానిక ఎన్నికల్లో గట్టెక్కాలని ప్రభుత్వం యత్నిస్తున్నదని తూంకుంట నర్సారెడ్డి చేసిన వ్యాఖ్యలే నిదర్శమని పలువురు పేర్కొంటున్నారు.