TSPSC | సూర్యాపేట/సంస్థాన్ నారాయణపురం/హైదరాబాద్, జనవరి 25 (నమస్తే తెలంగాణ): తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్‌గా మాజీ డీజీపీ మహేందర్‌రెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు గవర్నర్ తమిళిసై ఆమోద ముద్రవేయగా ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. చైర్మన్‌తోపాటు మరో ఐదుగురు సభ్యులను కూడా ప్రభుత్వం నియమించింది. టీఎస్పీఎస్సీ చైర్మన్‌తో పాటు సభ్యులు రాజీనామా చేయటంతో నూతన కమిషన్ నియామకం కోసం తెలంగాణ ప్రభుత్వం దరఖాస్తులను ఆహ్వానించింది. చైర్మన్ పదవి కోసం 50 మంది, సభ్యుల కోసం 321 మంది దరఖాస్తు చేసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, శాఖ కార్యదర్శి తిరుపతి, సాధారణ పరిపాలనశాఖ (సర్వీసెస్) కార్యదర్శి నిర్మలతో కూడిన స్రీనింగ్ కమిటీ సమావేశమై మహేందర్‌రెడ్డితో పాటు, ఓ విశ్రాంత ఐపీఎస్ అధికారి, త్వరలో ఉద్యోగ విరమణ చేయనున్న మరో ఐపీఎస్ అధికారి పేర్లతో జాబితాను ఎంపిక చేసింది. వారిలో మహేందర్‌రెడ్డి ఒకరే తెలంగాణకు చెందినవారు కాగా ప్రభుత్వం ఆయన నియమాకానికే ఎకువగా మొగ్గు చూపింది. టీఎస్పీఎస్సీ చైర్మన్‌గా మహేందర్‌రెడ్డి పేరును ప్రభుత్వం ప్రతిపాదించగా గవర్నర్ ఆమోదించారు. ఐదుగురు సభ్యుల్లో విశ్రాంత ఐఏఎస్ అనితారాజేంద్ర, ఇండియన్ పోస్టల్ సర్వీస్ విశ్రాంత ఉద్యోగి అమీర్ ఉల్లాఖాన్, జేఎన్టీయూ ప్రొఫెసర్ నర్రి యాదయ్య, యరబాది రామ్మోహన్రావు, పాల్వాయి రజనీకుమారి ఉన్నారు.
టీఎస్పీఎస్సీలో చైర్మన్ సహ మొత్తం 11 మంది సభ్యులు ఉండాలి. పేపర్ లీకేజీ పరిణామాల నేపథ్యంలో గత చైర్మన్‌తో పాటు ముగ్గురు సభ్యులు రాజీనామా చేశారు. మిగతా ఐదుగురు సభ్యుల పదవీకాలం అప్పటికే ముగిసింది. మిగిలిన ఇద్దరు సభ్యుల్లో సుమిత్రా ఆనంద్ తనోబా రాజీనామా సమర్పించగా ఇప్పటికీ గవర్నర్ వద్ద పెండింగ్‌లోనే ఉన్నది. ఆమోదించారా? లేదా? అనేదానిపై స్పష్టత లేదు. మరో సభ్యురాలు అరుణకుమారి ఇప్పటికీ కొనసాగుతున్నారు. వెరసి మొత్తంగా 11 సభ్యుల్లో 10 స్థానాలు ఖాళీగా ఉండగా ప్రస్తుతం చైర్మన్‌తోపాటు ఐదుగురు సభ్యులను నియమించారు. ఇంకా నలుగురు సభ్యులను నియమించాల్సి ఉన్నది. సుమిత్రా ఆనంద్ తనోబా రాజీనామాను ఆమోదిస్తే మొత్తంగా ఆమె స్థానాన్ని కలిపి 5 సభ్యులను నియమించాల్సి ఉంటుంది. కాగా, సభ్యుల్లో పాల్వాయి రజనీకుమారి మాత్రమే ఆరేండ్ల పాటు పూర్తికాల పరిమితిని పూర్తిచేసుకొనే అవకాశం ఉంది. మిగతా వారందరూ వయసు రీత్యా మధ్యలోనే రిటైర్ అవుతారు. గతంలో సభ్యురాలిగా నియమితులైన కోట్ల అరుణకుమారి 2021లో మే 21న పదవీ బాధ్యతలు చేపట్టారు. ఆమె 2027 వరకు సభ్యురాలిగా కొనసాగుతారు.
1986 ఐపీఎస్ బ్యాచ్‌కి చెందిన మహేందర్‌రెడ్డి స్వస్థలం ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం కిష్టాపురం గ్రామం. 5-7వ తరగతి వరకు స్వగ్రామంలో జడ్పీహెచ్ఎస్లో చదువుకున్న ఆయన కూసుమంచిలోని ఆశ్రమ పాఠశాలలో 10వ తరగతి, వరంగల్ నిట్‌లో బీటెక్ పూర్తిచేసి గోల్డ్ మెడల్ సాధించారు. ఐఐటీ ఢిల్లీలో ఎంటెక్ చదువుతుండగానే 1986లో ఐపీఎస్‌కు ఎంపికయ్యారు. తొలుత విశాఖపట్నం ట్రైనీ ఏఎస్పీగా నియమితులయ్యారు. ఉమ్మడి కరీనంగర్ జిల్లా రామగుండం ఏఎస్పీగా పూర్తిస్థాయి బాధ్యతలు చేపట్టారు. తెలంగాణ ఏర్పాటు తర్వాత హైదరాబాద్ కమిషనర్‌గా నియమితులయ్యారు. 2017 నవంబర్‌లో డీజీపీగా బాధ్యతలు స్వీకరించి 2022 డిసెంబర్ వరకు ఆ పదవిలో కొనసాగారు.
రంగారెడ్డి జిల్లా బండ్లగూడ జాగీర్ కిస్మత్‌పూర్‌కు చెందిన విశ్రాంత ఐఏఎస్ అనిత రాజేంద్ర ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఎల్ఎల్ఎం పట్టా అందుకున్నారు. గౌడ సామాజిక వర్గంలో ఐఏఎస్ సాధించిన మొదటి మహిళగా గుర్తింపు పొందారు. 1992లో సర్వీస్‌లో చేరిన ఆమె వివిధ హోదాల్లో సేవలందించారు. ఎంసీహెచ్ఆర్డీ అడిషనల్ డైరెక్టర్‌గా పనిచేస్తూ గత ఏడాది ఉద్యోగ విరమణ పొందారు.
హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌కు చెందిన ఉన్నత విద్యావంతుల కుటుంబంలో జన్మించిన అమీర్ ఉల్లాఖాన్ 1983లో ఇండియన్ పోస్టల్సర్వీసెస్లో చేరారు. 1995లో స్వచ్ఛంద ఉద్యోగ విరమణ తీసుకున్నారు. అనంతరం కేంద్ర ఆర్ధికశాఖ నేతృత్వంలో యూఎన్‌డీపీలో ప్రవేశించారు. ఉర్దూ వర్సిటీలో సివిల్ సర్వీసెస్ కోచింగ్ సెంటర్ డైరెక్టర్‌గా, ఎంసీహెచ్ఆర్డీలో విజిటింగ్ ప్రొఫెసర్‌గా సేవలందించారు.
సూర్యాపేట జిల్లాకేంద్రానికి చెందిన పాల్వాయి రజనీకుమారి ఎంఏ పొలిటికల్ సైన్స్, ఎల్ఎల్బీ, బీఈడీ పూర్తి చేశారు. తొలుత కొంతకాలం ప్రైవేట్ టీచర్‌గా పనిచేశారు. 2000లో గ్రూప్-3 ద్వారా వీడీవో ఉద్యోగం సాధించారు. అదే సంవత్సరం గ్రూప్-1కు ఎంపికై ఖైరతాబాద్ మున్సిపల్ డిప్యూటీ కమిషనర్‌గా, తాండూరు మున్సిపల్ కమిషనర్‌గా పనిచేశారు. 2004లో ఉద్యోగానికి రాజీనామా చేసి సూర్యాపేట ఎమ్మెల్యే అభ్యర్థిగా టీడీపీ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. 2014లో తుంగతుర్తి నుంచి బరిలో నిలిచి ఓటమి పాలయ్యారు. 2017లో బీజేపీలో చేరి అధికార ప్రతినిధిగా పనిచేశారు. గత ఎన్నికల ముందు కాంగ్రెస్‌లో చేరారు.
టీఎస్పీఎస్సీ బోర్డు మెంబర్‌గా నియమితులైన నర్రి యాదయ్య యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండలంలోని మల్లారెడ్డిగూడెంకు చెందినవారు. ప్రస్తుతం ఆయన జేఎన్టీయూహెచ్ రిజిస్ట్రార్‌గా విధులు నిర్వహిస్తున్నారు. ఉస్మానియా యూనివర్సిటీలో బీటెక్, 1988లో ఖరగ్‌పూర్ ఐఐటీలో ఎంటెక్ పూర్తి చేశారు. 2000లో జేఎన్టీయూహెచ్లో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా చేరి 2006లో ప్రొఫెసర్‌గా పదోన్నతి పొందారు.
ఎరుకల సామాజిక వర్గానికి చెందిన రామ్మోహన్రావు 1963లో జన్మించారు. 1984లో ఆంధ్రా యూనివర్సిటీలో బీఈ సివిల్ ఇంజినీరింగ్ పూర్తిచేశారు. సిక్కిం మణిపాల్ యూనివర్సిటీ నుంచి 2011లో ఎంబీఏ పూర్తిచేశారు. 1986లో విద్యుత్తు శాఖలో ఏఈగా ఉద్యోగంలో చేశారు. శ్రీశైలం, జూరాల, కేటీపీఎస్ విద్యుత్తు ప్రాజెక్టుల్లో ఎస్ఈగా, సీఈగా సేవలందించారు. ప్రస్తుతం టీఎస్జెన్కో ఈడీ (సివిల్ హైడల్)గా కొనసాగుతున్నారు.
టీఎస్పీఎస్సీలో చైర్మన్‌గా నియమితులైన మాజీ డీజీపీ మహేందర్‌రెడ్డి ఆ పదవిలో 11నెలల పాటే కొనసాగే అవకాశం ఉన్నది. టీఎస్పీఎస్పీ చైర్మన్‌గా, కమిషన్ సభ్యులుగా నియమితులైనవాళ్లు 62 ఏండ్లు వచ్చేవరకు, లేదంటే 6 ఏండ్ల పాటు మాత్రమే ఆ పదవిలో కొనసాగాల్సి ఉంటుంది. మహేందర్‌రెడ్డి 1962లో డిసెంబర్3న జన్మించగా ప్రస్తుతం ఆయన వయసు 61 సంవత్సరాల 1 నెల 22 రోజులు. మరో 11 నెలల గడిస్తే ఆయన 62 ఏండ్ల వయస్సును దాటిపోతారు. ఈ నేపథ్యంలోనే చైర్మన్‌గా మహేందర్‌రెడ్డి 11 నెలల పాటే కొనసాగే అవకాశం ఉన్నది. జేఎన్టీయూకు చెందిన ఇద్దరు టీఎస్పీఎస్సీలో కీలక పోస్టుల్లో నియమితులు కావటం పట్ల వర్సిటీ అధికారులు హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు యూనివర్సిటీ వీసీ డాక్టర్ కట్టా నర్సింహారెడ్డి, రిజిస్ట్రార్ డాక్టర్ మంజూరుహుస్సేన్, డైరెక్టర్ డాక్టర్ గోవర్ధన్ తదితరులు వారికి శుభాకాంక్షలు తెలియచేశారు.