ఖలీల్‌వాడి, ఏప్రిల్ 19: కాంగ్రెస్ అంటేనే దొంగల పార్టీ.. ఆరు గ్యారెంటీల పేరుతో అధికారం చేపట్టి ప్రజలను వంచించిన ఘనత ఆ పార్టీదని మాజీ ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ ధ్వజమెత్తారు. కాంగ్రెస్ వస్తే మార్పు వస్తుందని ఊదరగొట్టారని, వంద రోజుల పాలనకే ప్రజలను ఇబ్బందుల్లోకి నెట్టారని మండిపడ్డారు. శుక్రవారం నిజామాబాద్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిగా బాజిరెడ్డి గోవర్ధన్ నామినేషన్ దాఖలు చేసిన సందర్భంగా నగరంలో నిర్వహించిన బీఆర్ఎస్ భారీ బహిరంగ సభలో మాజీ మంత్రులు వేముల ప్రశాంత్‌రెడ్డి, గంగుల కమలాకర్, వీ శ్రీనివాస్‌గౌడ్, రాజ్యసభ సభ్యుడు కేఆర్ సురేశ్‌రెడ్డి, ఎమ్మెల్యేలు డాక్టర్ సంజయ్, కే సంజయ్, ఎమ్మెల్సీ ఎల్ రమణ, మాజీ ఎమ్మెల్యేలు జీవన్‌రెడ్డి, బిగాల గణేశ్‌గుప్తా, విద్యాసాగర్‌రావు, నిజామాబాద్ బీఆర్ఎస్ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మహమూద్ అలీ మాట్లాడుతూ.. తెలంగాణ సాధించిన కేసీఆర్ నాయకత్వాన్ని పొరపాటున కోల్పోయామని ప్రజలు బాధ పడుతున్నారని తెలిపారు. దొంగ హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ తెలంగాణను బర్బాత్ చేస్తున్నదని విమర్శించారు. బీజేపీ విద్వేషాలు రెచ్చగొడుతున్నదని, హిందూ, ముస్లింల మధ్య చిచ్చు పెడుతున్నదని మండిపడ్డారు.
మోదీ, రేవంత్‌రెడ్డి ఒక్కటేనని మాజీ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి ఆరోపించారు. ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి కరీంనగర్ టికెట్ అడిగితే నిజామాబాద్‌లో నిలబెడుతున్నారని, ఇక్కడ బీజేపీ అభ్యర్థి అర్వింద్‌ను గెలిపించేందుకు రెండు పార్టీలు కలిసి పని చేస్తున్నాయని విమర్శించారు. పసుపుబోర్డు తెస్తానని బాండ్ పేపర్ రాసిచ్చి గత ఎన్నికల్లో గెలిచిన ఎంపీ అర్వింద్‌కు ఈసారి గట్టి బుద్ధిచెప్పాలని పిలుపునిచ్చారు. మరో మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ.. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పదేండ్లు ఎంతో కష్టపడి తెలంగాణను దేశంలోనే నంబర్‌వన్‌గా నిలబెట్టారని తెలిపారు.
కేసీఆర్ పాలనలో ఉన్న కరెంట్ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎందుకు పోతున్నదని ప్రశ్నించారు. సాగునీరు లేక పంటలు ఎండిపోయి రైతులు ఆగమవుతుంటే వారిని పట్టించుకునే వారే లేరని మాజీ మంత్రి గంగుల కమలాకర్ ఆవేదన వ్యక్తం చేశారు. నిజామాబాద్, జగిత్యాల జడ్పీ చైర్పర్సన్లు విఠల్‌రావు, వసంత, మాజీ ఎమ్మెల్సీ వీజీ గౌడ్, బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ సతీమణి ఆయేషా ఫాతిమా, నిజామాబాద్ మేయర్ నీతూకిరణ్ పాల్గొన్నారు.