హనుమకొండ చౌరస్తా, నవంబర్ 3: దేశంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకొచ్చేందుకు రాహుల్‌గాంధీ పాదయాత్ర చేస్తే.. రాష్ట్రంలో రేవంత్‌రెడ్డి దొంగలకు టికెట్లు అమ్ముకొని పార్టీని సర్వనాశనం చేస్తున్నారని డీసీసీబీ మాజీ చైర్మన్ జంగా రాఘవరెడ్డి మండిపడ్డారు. శుక్రవారం హనుమకొండ హంటర్‌రోడ్‌లోని విష్ణుప్రియ గార్డెన్లో కాంగ్రెస్ ముఖ్యకార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జంగా రాఘవరెడ్డి మాట్లాడుతూ.. భూములు కబ్జా చేసి, పేదలకు పంచాల్సిన ఇందిరమ్మ ఇండ్లు అమ్ముకున్న నాయిని రాజేందర్‌రెడ్డికి రేవంత్ టికెట్ ఇచ్చారని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ కుటుంబాన్ని, తాను నమ్మిన నాయకుడు రాహుల్ గాంధీ సిద్ధాంతాలకు వ్యతిరేకంగా రాష్ట్ర నాయకత్వం పనిచేస్తున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. జంగా రాఘవరెడ్డి గెలిస్తే అందరిని నిలదీస్తాడని ఇక్కడి నాయకులు టికెట్ రాకుండా అడ్డుకున్నారని చెప్పారు. సింహం గుర్తుపై స్వతంత్రంగా పోటీ చేస్తున్నానని, స్వతంత్రంగా గెలిచి కాంగ్రెస్ పార్టీలోనే చేరుతానని జంగా రాఘవరెడ్డి స్పష్టం చేశారు. ఇక్కడి ప్రజలు కాంగ్రెస్ నాయకులకు బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు. సింహం గుర్తుకు ఓటు వేసి తనను గెలిపించాలని జంగా ప్రజలను కోరారు. ఈ సమావేశంలో కార్పొరేటర్లు జక్కుల రవీందర్‌యాదవ్, రజాలీ, నగర మాజీ అధ్యక్షుడు కట్ల శ్రీనివాసరావు, మాజీ కౌన్సిలర్ రేపల్లె శ్రీనాథ్, యువజన నాయకులు రంగనాథ్, కొడిపాక గణేశ్, గుజ్జుల శ్రీనివాస్‌రెడ్డి, ధన్‌రాజ్, యాకూబ్‌రెడ్డి, కత్తుల కవిత, విజయ తదితరులు పాల్గొన్నారు.