హైదరాబాద్, అక్టోబర్ 14 (నమస్తేతెలంగాణ): ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పాల్గొనే కార్యక్రమాలలో ఆయన సెక్యూరిటీ సిబ్బంది ప్రవర్తిస్తున్న తీరుపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఆదివారం హైదరాబాద్‌లో జరిగిన అలయ్..బలయ్‌లో సీఎం వస్తున్న సందర్భంలో ఆయన సెక్యూరిటీ సిబ్బంది కేంద్ర సమాచార హక్కు చట్టం మాజీ కమిషనర్ మాడభూషి శ్రీధర్ గొంతు పట్టుకొని బయటకు తోశారు. సీనియర్ జర్నలిస్టు, తెలంగాణ ఉద్యమ నాయకుడు పాశం యాదగిరి కాలును తొక్కుతూ వెళ్లిపోయారు. దీనిపై మాడభూషి శ్రీధర్ సోమవారం ఎక్స్ వేదికగా విరుచుకుపడ్డారు. ‘సీఎం సెక్యూరిటీ తీరుతో అసలే అనారోగ్యంతో ఉన్న నేను ఒక దశలో ప్రాణాలు పోతాయనుకున్నా’ అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ‘సీఎం చుట్టూ ఉన్నది రక్షక భటులా? రజాకారులా? ప్రైవేట్ సైన్యమా? లేదంటే కిరాయి గుండాలా?’ అని ప్రశ్నించారు. ఇలాంటి వారి రక్షణలో ఉండే సీఎం ప్రజలను ఏం రక్షిస్తాడు? ప్రజాపాలన అంటే ప్రజలను హింసించడమేనా?’ అని కడిగిపారేశారు.
ఇటీవలి కాలంలో తరచూ ఇదే తీరు..
సీఎం సెక్యూరిటీ సిబ్బంది తరచుగా దుడుకుగా వ్యవహరిస్తూ ప్రజాప్రతినిధులు, సామాన్యులను తీవ్ర ఇబ్బంది పెడుతున్నారు. రెండు నెలల క్రితం కాంగ్రెస్‌కు చెందిన ఓ ఎమ్మెల్యేను అధికారిక కార్యక్రమంలో సీఎం వద్దకు వెళ్లకుండా అడ్డుకున్నారు. మొన్నటి మహబూబ్‌నగర్ పర్యటన సందర్భంలోనూ కాంగ్రెస్ కీలక నేత, లోక్‌సభ సభ్యుడు, ముఖ్యమంత్రి అనుంగు అనుచరిడిగా ముద్రపడ్డ నాయకుడికి సైతం ఇదే అనుభవం ఎదురైంది. అక్కడే ఉన్న సీఎం సైతం పట్టించుకోకపోగా చూస్తూ మిన్నకుండిపోయారు. ఇలా అనేక సందర్భాల్లో సీఎం సెక్యూరిటీ సిబ్బంది ఓవరాక్షన్ చేస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.