హైదరాబాద్, డిసెంబర్ 21(నమస్తే తెలంగాణ) : రాష్ట్ర ఉజ్వల భవిష్యత్ కోసం ఐదారేండ్లు ఎంతో శ్రమకోర్చి తమ హయాంలో ఫార్మాసిటీ తీసుకొస్తే కాంగ్రెస్ ప్రభుత్వం ఆ భూములను అమ్ముకునేందుకు కుట్రలు చేస్తున్నదని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తీవ్రస్థాయి లో ధ్వజమెత్తారు. అది ఫ్యూచర్ సిటీ కాదని.. రియల్ ఎస్టేట్ పేరుతో లూటీ అని నిప్పులుచెరిగారు. దిక్కుమాలిన పాలసీలు, రియల్ ఎస్టే ట్ బ్రోకర్ దందాలు తప్ప ఈ దద్దమ్మ ప్రభు త్వం చేసేదేమీలేదంటూ ధ్వజమెత్తారు. తెలంగాణ భవన్లో ఆదివారం సాయంత్రం నిర్వహించిన ప్రెస్మీట్లో కేసీఆర్ మాట్లాడారు. వివరాలు ఆయన మాటల్లోనే ‘ఎందుకొచ్చిందండి ఫార్మాసిటీ.. అనుకోకుండా కొన్ని ప్రాం తాలకు, రాష్ర్టాలకు కొన్ని సందర్భాలు కలిసివస్తయ్.. అప్పటి భారత ప్రభుత్వం ఈ కిలకోయవ్యాధి, కలరా వ్యాధులతో ప్రజలు ఇబ్బడిముబ్బడిగా సచ్చిపోయేది. ఎందుకంటే దీని కి ప్రాపర్‌గా మెడికేర్ లేదు. ఎక్కడికక్కడ లోకలైజ్డ్ ప్రొడక్షన్స్ ఉండాలని చెప్పి ఐడీపీఎల్స్ అని పెట్టిన్రు. ఆ టైంల మనకు రాజధానిగా హైదరాబాద్ ఉన్నందున మన రాష్ర్టానికి ఐడీపీఎల్ వచ్చింది. ఐడీపీఎల్ పుణ్యమా అని అనేకమంది నేర్చుకొని బయటకు వచ్చిన్రు. అంజిరెడ్డి కూడా ఐడీపీఎల్ ఎంప్లాయే. వాళ్లు పరిశ్రమలు పెట్టి ఫార్మాను విస్తరించిన్రు. దీని వల్ల హైదరాబాద్ మెడికల్, ఫార్మాహబ్‌గా రూపుదిద్దుకున్నది.
ప్రపంచంలో మూడో వంతుకు మన జీనోమ్‌వ్యాలీ నుంచే వ్యాక్సిన్ సరఫరా అవుతది. రసాయన వ్యర్థాలతో హుస్సేన్‌సాగర్ కలుషితమై గబ్బుగబ్బు అయిపోయింది. దీని నుంచి బయటపడేందుకు నలుగురు ఐఏఎస్ అధికారుల బృందాలను అప్పటి హెల్త్ సెక్రటరీ శాంతికుమారి నేతృత్వంలో అనేక దేశాలకు పం పినం. తెలంగాణ భవిష్యత్ దృష్ట్యా ఫార్మా ను కాపాడుకోవాలె. కాలుష్యం బారి నుంచి ప్రజలను రక్షించుకోవాలె.. ఇందుకోసమే జీరో లిక్విడ్ బేస్ టెక్నాలజీని తెచ్చి నం. ఈ పద్ధతి ఇంటర్నేషనల్ లెవల్లో సక్సెస్ అయింది. మనం ఆ సిస్టం పెట్టుకోవచ్చు కదా అని ఓ ఫార్మా యూనివర్సిటీని పెట్టుకోవాలని భావించి రెండు హెలికాప్టర్లలో ఫార్మా బిజినెస్మెన్స్ను వెంట తీసుకొని ముచ్చర్ల కాడ ఫ్లేస్ ఫైనల్ చేసి శంకుస్థాపన చేసినం. ఐదారేండ్లు కష్టపడి రైతులను ఒప్పించి ఫార్మాసిటీ కోసం 14వేల ఎకరాలు సేకరించినం.. ఎంఈవోయూలు కూడా జరిగినయ్. జీడిమెట్ల, చర్లపల్లిలోని పరిశ్రమల నిర్వాహకులు కూడా ప్రత్యామ్నాయ స్థలాలు చూపితే తరలిపో తం.. అంటూ ముందుకు వచ్చిన్రు. కామన్ అఫ్లూయెంట్స్ ప్లాంట్స్ పెట్టి, రసాయన వ్యర్థాలు ఎటుపడితే అటుపోవద్దని, కాలుష్య నియంత్రణ జరగాలని ఏర్పాటు చేసిందే ఫార్మాసిటీ. కేంద్రం నుంచి ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ కూడా వచ్చింది. హైదరాబాద్ ఫా ర్మాను ఒక్క దగ్గరికి తీసుకుపోవాలె. పద్ధతిగా అభివృద్ధి చేయాలని సంకల్పించినం.’
కిచెన్‌ను క్లీన్‌గా పెట్టుకొన్నట్టే ఫార్మా కంపెనీలను క్లీన్‌గా పెట్టుకోవాలె. మనదేశంలోనైతే ఫార్మా కంపెనీల ముందునుంచి గబ్బు వాసన వస్తది. కానీ యూఎస్ఏ, జపాన్, యూరప్, చైనాలో ఈ పరిస్థితి లేదు. అక్కడ పరిశ్రమల గొట్టాల నుంచి పొగ కూడా రాదు. మనం గా మాత్రం పెట్టుకోవడానికి తెలివిలేదా? టెక్నాలజీ లేదా? అని భావించి ఐఏఎస్ బృందాలను వివిధ దేశాలకు పంపించిన. ఫార్మాసిటీకి ప్లాన్ చేసిన.
– కేసీఆర్
ఏం జరుగుతుంది రాష్ట్రంలో? ఫ్యూచర్సిటా, తొక్కసిటీయా?, ఎవనికి కావాలె నీ ఫ్యూచర్‌సిటీ నువ్వు పెంచినవా హైదరాబాద్ ను.. ఇంత వైబ్రెంట్ సిటీ ఎక్కడినుంచి వచ్చిం ది. ఓ 400 సంవత్సరాల నుంచి ఒకటీఒకటి తెచ్చుకొని అభివృద్ధి చేసుకొంటే ఆటోమెటిక్ గా పెద్దసిటీ అయింది. ఎన్ని రాష్టాలకు ఉన్నాయండి ఇట్లాంటి సిటీలు.. మహారాష్ట్రకు ముంబై, పశ్చిమబెంగాల్‌కు కోల్కత్తా, కర్ణాటకకు బెంగళూరు, తమిళనాడుకు చెన్నై.. మన కు హైదరాబాద్ ఉన్నయ్.. ఇంత మహానగరం భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకొని పెట్టిందే ఫార్మాసిటీ. కానీ ఇవన్నీ తీసుకపోయి ఫ్యూచర్‌సిటీ, తొక్కసిటీ అంటున్నరు. దిక్కుమాలిన పాలసీలు, రియల్ ఎస్టేట్ బ్రోకర్ దందా తప్ప ఈ ప్రభుత్వం చేసేదేమీలేదు.
గురుకుల విద్యార్థులను సాదే తెలివిలేదు గానీ ఫ్యూచర్‌సిటీ కడతవా? నీతోటి అయిత దా? జూపార్కును కొంచబోయి ఆడ పెడ్తరట. ఎందుకు జూపార్కు అమ్ముకొనేందుకా? ఏం జరుగుతుంది ఈ రాష్ట్రంలో.. మేం ఉన్నప్పుడు గిసొంటి చిల్లర పనులు చేయలే. ఇదెక్కడి దిక్కుమాలిన దందా.. అసలు. ఏం జేయదలుచుకున్నరు ఈ రాష్ట్రాన్ని.. నేను ఒక్కటే మాట అడుగుతున్న. ఏ ప్రభుత్వమైనా బిజినెస్ మీట్ పెట్టి ఎంవోయూలు చేసుకుంటది. కానీ అడ్డగోలు జమాబందీ లెక్కలేని కథేంది నాకు అర్థంకాదు. ఓ హైప్ క్రియేట్ జేసుడు. దీనికి ఆద్యుడు, గురువు చంద్రబాబునాయుడు.. ఆయన చెప్పిన లెక్కన బిజినెస్ అయ్యేదుంటే, ఎంవోయూలు సక్సెస్ అయ్యేదుంటే ఆంధ్రప్రదేశ్‌కు ఈపాటికి రూ.20 లక్షల కోట్లు వచ్చేదుండె. ఆయన ఫస్ట్‌టైం సీఎం అయినప్పుడు వైజాగ్‌లో పరిశ్రమలు పెట్టేందుకు అక్కడ స్టార్ హోటళ్లలోని వంట మనుషులు, సప్లయర్స్‌తో ఒప్పందాలు చేసుకున్నరని కేసీఆర్ మండిపడ్డారు.
గురుకుల విద్యార్థులు చనిపోవుడేంది. ఇప్పటికి 120మంది పిల్లలు సచ్చిపోయిన్రు. వాళ్లను సాదే తెలివిలేదు గానీ.. ఏందో ఫ్యూచర్‌సిటీ కడ్తవా? నీతోటి అయితదా? ఫార్మాసిటీకి ఉపయోగిస్తమనే షరతుతోనే అప్పుడు భూములు తీసుకున్నం. హైకోర్టుకేమో ఫార్మాసిటీ ఉంటది అని ప్రభుత్వం అంటది. మళ్లా అక్కడ 3వేల ఎకరాలల్ల అంబానా.. సల్మాన్ఖానా.. వంతారానో బొంతారానో పెడ్తరట. జూపార్కును కొంచబోయి ఆడ పెడ్తరట. ఎందుకు జూపార్కు అమ్ముకొనేందుకా? ఏం జరుగుతుంది ఈ రాష్ట్రంలో..?
– కేసీఆర్