హైదరాబాద్, మే 3 (నమస్తేతెలంగాణ): కాంగ్రెస్ 28 నెలల పాలనలో ముఖ్యమంత్రి, మంత్రులు కలిసి 28 స్కామ్‌లకు పాల్పడ్డారని ఎస్సీ, ఎస్టీ కమిషన్ మాజీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ సంచలన ఆరోపణలు చేశారు. ఆరు గ్యారంటీలను గాలికొదిలి ప్రజాధనాన్ని లూటీ చేస్తున్నారని విరుచుకుపడ్డారు. ప్రతిపక్షంపై నిందలు వేస్తూ తప్పించుకొనే ప్రయత్నం చేస్తున్నారని దుయ్యబట్టారు. ప్రభుత్వ పెద్దలపై అవినీతి ఆరోపణలు రాగానే బ్యాచ్ బయటకు వచ్చి కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావును దూషిస్తూ ప్రజలను తప్పుదోవపట్టిస్తున్నారని మండిపడ్డారు. ఆదివారం తెలంగాణ భవన్లో పార్టీ రాష్ట్ర నేతలు గోసుల శ్రీనివాస్, అభిలాష్ రంగినేని, రాఘవేంద్ర యాదవ్, కిశోర్‌గౌడ్, తుంగ బాలు, ఏ హరిబాబుతో కలిసి విలేకరులతో మాట్లాడారు. కాంగ్రెస్ అంటేనే స్కామ్‌లు, కమీషన్లు, అక్రమ దందాలకు కేరాఫ్ అని ఫైర్ అయ్యారు.
మొబిలైజేషన్ అడ్వాన్స్‌ల పేరిట సర్కార్ సొమ్మును దోచుకుంటున్నారని ఆరోపించారు. హ్యామ్ రోడ్ల కాంట్రాక్ట్‌ను 25 శాతం ఎక్సెస్‌తో కట్టబెట్టారని, కొత్వాల్‌గూడలో మంత్రి పొంగులేటికి చెందిన రాఘవ కన్స్ట్రక్షన్స్ అక్రమ మైనింగ్ చేస్తున్నదని హరీశ్‌రావు ఆధారాలతో బట్టబయలు చేశారని గుర్తుచేశారు. కానీ సమాధానం చెప్పాల్సిన అద్దంకి దయాకర్, బల్మూరి వెంకట్ హరీశ్‌రావుపై అడ్డంపొడుగూ మాట్లాడడం శోచనీయమని పేర్కొన్నారు. దమ్మూ ధైర్యముంటే హ్యామ్ మోడల్ రోడ్లలో బిడ్ ఓపెన్ అయిందా? లేదా? చెప్పాలని సవాల్ విసిరారు. కొత్తగా ఎమ్మెల్సీలు కాగానే కొమ్ములొచ్చినట్లు మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ కాదు.. అడ్డంకి దయాకర్. నోటికి వచ్చినట్లు మాట్లాడడమే ఆయన నైజం. అక్రమాలకు పాల్పడిన అధికార పార్టీ నేతలను వెనుకేసు కురావడమే ఆయన విధానం.’అంటూ తనదైన శైలిలో చురకలంటించారు. 14 ఏండ్ల ఉద్యమ ప్రస్థానం, 10 ఏండ్ల పాలనలో బీఆర్ఎస్ ఏం చేసిందో తెలంగాణ ప్రజలకు తెలుసని స్పష్టంచేశారు.
రాష్ట్రంలో రేవంత్, భట్టి ట్యాక్స్
ప్రజాపాలన అందిస్తామని గొప్పలు చెప్పిన కాంగ్రెస్ నేతలు అక్రమాల పాలనను తెరపైకి తెచ్చారని ఎర్రోళ్ల దుయ్యబట్టారు. అన్ని శాఖల్లో విచ్చలవిడిగా అవినీతి రాజ్యమేలుతున్నదన్నారు. బర్త్ సర్టిఫికెట్‌కు కూడా లంచం ముట్టజెప్పాల్సిన దుస్థితి నెలకొన్నదని విమర్శించారు. తెలంగాణలో రేవంత్ ట్యాక్స్‌తోపాటు, భట్టి, పొన్నం, పొంగులేటి, ఉత్తమ్, కోమటిరెడ్డి, సీతక్క ట్యాక్స్‌లు నడుస్తున్నాయని తూర్పారబట్టారు. పాలనను పక్కనపెట్టి అక్రమాలు మాత్రం దండిగా చేస్తున్నారని మండిపడ్డారు. చిత్తశుద్ధి ఉంటే తాము చేసిన ఆరోపణలపై సిట్, సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. బల్మూరి, అద్దంకి మరోసారి అడ్డగోలుగా మాట్లాడితే బీఆర్ఎస్ చూస్తూ ఊరుకోబోదని హెచ్చరించారు.