హైదరాబాద్, మే 18 (నమస్తే తెలంగాణ): ధాన్యం కొనుగోళ్లు, సన్నబియ్యం టెండర్లలో రూ.1000 కోట్ల కుంభకోణం జరిగిందని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి ఆరోపించారు. బియ్యం, వడ్ల కొనుగోళ్లు, టెండర్లలో కాంగ్రెస్ ప్రభుత్వం చేతివాటం ప్రదర్శిస్తున్నదని పేర్కొన్నారు. శనివారం తెలంగాణ భవన్లో పౌరసరఫరాల సంస్థ మాజీ చైర్మన్ రవీందర్‌సింగ్‌తో కలిసి ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో సుదర్శన్‌రెడ్డి మాట్లాడుతూ గ్లోబల్ టెండర్లలో ధాన్యాన్ని కొనుగోలు చేసిన సంస్థ 90 రోజులు పూర్తి అయినా డబ్బులు చెల్లించలేదని, ధాన్యాన్ని తీసుకువెళ్లలేదని తెలిపారు. అయినప్పటికీ నిబంధనలకు విరుద్ధంగా ఆ సంస్థకు మరికొంత సమయం ఇచ్చేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తుందని పేర్కొన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, అంగన్వాడీ సెంటర్లలో మధ్యాహ్న భోజనానికి అవసరమైన సన్నబియ్యాన్ని సరఫరా చేసేందుకు పౌరసరఫరాల సంస్థ టెండర్లు పిలిచిందని, బహిరంగ మార్కెట్లో కిలో సన్నబియయం రూ. 42-45 మధ్య లభ్యమవుతున్నా టెండర్లలో మాత్రం రూ. 57కు ఖరారు చేశారని పేర్కొన్నారు.
ఏడాదికి 10 నెలలకు 2.20 లక్షల టన్నుల బియ్యం అవసరం అవుతాయని, ఈ లెక్కన కిలోకు రూ. 15 చొప్పున అదనంగా చెల్లిస్తే మొత్తం రూ.330 కోట్ల కుంభకోణం జరిగిందని ఆరోపించారు. ఈ మొత్తం వ్యవహారం ఆ శాఖ మంత్రికి, ముఖ్యమంత్రికి తెలియకుండా జరిగే అవకాశమే లేదని పేర్కొన్నారు. ఒక సంస్థ రూ. 57కు టెండరు దాఖలు చేస్తే, మరో మూడు సంస్థలు రూ. 56.90 చొప్పున వేశాయని, ఒక్క పైసా కూడా తేడా లేకుండా మూడు సంస్థలు టెండరు ఎలా దాఖలు చేశాయని అనుమానం వ్యక్తంచేశారు. పౌరసరఫరాలశాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కనుసన్నల్లోనే ఇదంతా జరుగుతున్నదని ఆరోపించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తొలి రోజుల్లో రాష్ట్రంలోని 35 లక్షల టన్నుల వడ్లను విక్రయించేందుకు పిలిచిన గ్లోబల్ టెండర్లలోనూ అక్రమాలు జరిగాయని సుదర్శన్‌రెడ్డి ఆరోపించారు. ఇందులో సీఎం రేవంత్‌రెడ్డి, ఉత్తమ్ ప్రత్యక్ష ప్రమేయం ఉన్నదని పేర్కొన్నారు. రేవంత్ నుంచి రాహుల్‌కు వాటాలు వెళ్లాయని తెలిపారు. గ్లోబల్ టెండర్లలో ధాన్యాన్ని కొనుగోలు చేసిన సంస్థ ధాన్యం తరలించేందుకు మరింత సమయం ఇస్తే న్యాయపోరాటం చేస్తామని తెలిపారు. రైస్ మిలర్లను బెదిరించి భయభ్రాంతులకు గురిచేస్తున్నారని మండిపడ్డారు. టెండరులో క్వింటాలుకు రూ. 2007కు కోట్ చేశారని, కానీ గోదాముల్లో ఉన్న ధాన్యాన్ని తీసుకెళ్లకుండా మిల్లర్ల దగ్గరున్న ధాన్యంపై ఒత్తిడి తెస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. వారి దగ్గర ధాన్యం లేకుంటే క్వింటాలుకు రూ.2,230 చెల్లించాలని టెండరు దక్కించుకున్న సంస్థ డిమాండ్ చేస్తున్నదని తెలిపారు. తమకు అదనపు ఖర్చు అయిందని చెప్తూ అదనంగా రూ. 223 వసూలు చేస్తున్నారని పేర్కొన్నారు. ఇదే ధాన్యాన్ని తాము క్వింటాలను రూ. 2100 చొప్పున కొనుగోలు చేస్తామని రైస్ మిల్లర్లు లేఖలు ఇచ్చినా తిరస్కరించిన ప్రభుత్వం కొన్ని సంస్థలకు లాభం చేకూర్చేలా వ్యవహరిస్తున్నదని ఆగ్రహం వ్యక్తంచేశారు.
సివిల్ సైప్లె కార్పొరేషన్ మాజీ చైర్మన్ రవీందర్‌సింగ్ మాట్లాడుతూ గ్లోబల్ టెండర్లలో రూ.700 కోట్ల కుంభకోణం జరిగిందని ఆరోపించారు. పౌరసరఫరాలశాఖలో మొత్తంగా రూ. 1000 కోట్ల కుంభకోణం జరిగిందని తెలిపారు. కాంగ్రెస్ నేతల ఒత్తిడికి తలొగ్గకుండా అధికారులు నిబంధనల మేరకు వ్యవహరించాలని సూచించారు. ఈ టెండర్ల అక్రమాలపై సోమవారం బీఆర్ఎస్ పార్టీ తరపున సీఎస్‌కు ఫిర్యాదు చేయనున్నట్టు చెప్పారు. టెండర్ల ప్రక్రియను పౌరసరఫరాల మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఓ ప్రహసనంగా మార్చారని విమర్శించారు. మొన్నటి ఎన్నికల్లో ఆర్ఆర్ ట్యాక్స్ అన్నదానికి అర్థం ఈ టెండర్లేనని తెలిపారు. టెండర్లు గడువు పెంచితే తాము సీబీఐకి ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు. ధాన్యం కొనుగోలుకు గ్లోబల్ టెండర్లు దకించుకున్న నాలుగు సంస్థలే సన్న బియ్యం సేకరణకూ టెండర్లు దకించుకోవడం అనేక అనుమానాలకు తావిస్తున్నదని పేర్కొన్నారు.