హైదరాబాద్, అక్టోబర్ 24 (నమస్తే తెలంగాణ): ‘జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ నీతిమాలిన రాజకీయాలకు తెరలేపింది. ఓటమి భయంతోనే ఆ పార్టీ నేతలు ఫేక్ ప్రచారానికి దిగారు. అలాంటి వారిపై చర్యలు తప్పవు’ అని బీఆర్ఎస్ మాజీ మంత్రి వీ శ్రీనివాస్‌గౌడ్ హెచ్చరించారు. హైదరాబాద్ తెలంగాణ భవన్లో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘జూబ్లీహిల్స్ కాంగ్రెస్ అభ్యర్థి నవీన్‌యాదవ్‌కు నేను మద్దతు తెలిపానని, సోషల్ మీడియాలో ఫేక్ పోస్టులు పెడుతున్నారు. కానీ, ఆయన నాతో ఫొటో ఎప్పు డు దిగాడో, నాతో ఆయన ఎప్పుడు మాట్లాడాడో? నాకైతే తెలియదు’ అని తేల్చిచెప్పారు. కాంగ్రెస్ అధికారిక ఫేస్బుక్ ఖాతాలో తనపై ఫేక్ పోస్టు పెట్టడాన్ని ఆయన తీవ్రంగా పరిగణించారు. ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీది సిగ్గుమాలిన చర్యగా ఆయన అభివర్ణించారు. తాను తెలంగాణ ఉద్యమకాలం నుంచి తెలంగాణ తొలి సీఎం కేసీఆర్‌తోనే ఉన్నానని, తన తండ్రి కూడా తెలంగాణ ఉద్యమకారుడేనని చెప్పారు. తెలంగాణ కోసం తాను ఉద్యోగాన్ని సైతం వదులుకున్నానని, ఉద్యోగంలో ఉండి పోరాడుతూ జైలుకూ వెళ్లానని తెలిపారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే తన తమ్ముడిని 40 రోజులు జైల్లో పెట్టి, తమ కుటుంబాన్ని వేధించారని మండిపడ్డారు. తనను ఎవరెన్ని ఇబ్బందులు పెట్టినా, తాను జీవితాంతం కేసీఆర్‌తోనే ఉంటూ, బీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతానని స్పష్టం చేశారు.
‘సైబర్ క్రైమ్’లో ఫిర్యాదు చేస్తా
సోషల్ మీడియాలో తనపై అసత్యపు ప్రచా రం చేస్తున్న వారిపై సైబర్ క్రైమ్‌లో అన్నిరకాల ఫిర్యాదులు చేస్తానని వీ శ్రీనివాస్‌గౌడ్ తెలిపారు. బాధ్యులైన వారిపై రూ.10 కోట్లకు పరువునష్టం దావా వేస్తానని హెచ్చరించారు. సోషల్ మీడియాలో తనపై వస్తున్న తప్పుడు ప్రచారాలపై రాష్ట్ర డీజీపీ ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. కేవలం కాంగ్రెస్ వాళ్లను మాత్రమే డీజీపీ కాపాడుతారా? అని సూటిగా ప్రశ్నించారు. సెటిల్మెంట్ చేసిన వాళ్లను, లైంగికదాడి కేసుల్లో ఉన్న వాళ్లను వెంట తిప్పుకోవడం కాంగ్రెస్ నేతలకు అలవాటుగా మారిందని ఆయన దుయ్యబట్టారు.
సునీత గెలుస్తారనే అక్కసు
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీఆర్ఎస్ అభ్య ర్థి మాగంటి సునీతా గోపీనాథ్ తప్పక గెలుస్తారన్న అక్కసుతోనే తనపై ఇలాంటి తప్పుడు ప్రచారాలకు కాంగ్రెస్ దిగిందని శ్రీనివాస్‌గౌడ్ ఆగ్రహం వ్యక్తంచేశారు. తనతోపాటు తన కు టుంబ సభ్యులను వేధించినా భయపడేది లేదని స్పష్టంచేశారు. తాను ఎంతో కష్టపడి ఈ స్థాయికి వచ్చానని, తమ జీవితాలతో ఆటలాడుకోవద్దని హితవు పలికారు. పార్టీ మారితే తనపై ఉన్న కేసులు ఎత్తివేస్తామని హామీ ఇచ్చి నా, తాను ఒప్పుకోలేదని వివరించారు. తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ రాష్ట్రంలో బీసీలకు మేలు చేసినంతగా వేరే ఏ సీఎం కూడా చేయలేదని తెలిపారు. కాంగ్రెస్ నాయకుల మాదిరిగా తాను చెట్టు కొమ్మను నరుక్కోబోనని తేల్చి చెప్పారు. సమావేశంలో మాజీ ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్, ఎమ్మెల్సీ నవీన్‌కుమార్‌రెడ్డి, బీఆర్ఎస్ నేత కిషోర్‌గౌడ్ పాల్గొన్నారు.