హైదరాబాద్, ఫిబ్రవరి 21 (నమస్తే తెలంగాణ): గాంధీభవన్ సాక్షిగా ధర్మాగ్రహంతో తోట యాదగిరి సంధించిన ప్రశ్నలకు ముందు సమాధానాలు ఇవ్వు అని సీఎం రేవంత్‌రెడ్డిని మాజీ మంత్రి హరీశ్‌రావు ప్రశ్నించారు. ఆ ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చే ధైర్యం ఉన్నదా? అని అడిగారు. రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, రేవంత్‌రెడ్డిని నిలదీసే యాదన్నలే ఉన్నారని, వారికి బీఆర్ఎస్ అండగా ఉంటుందని స్పష్టంచేశారు. ఎన్నికల సమయంలో రైతాంగానికి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను అమలు చేసేదాకా అన్ని విధాలా అండగా ఉంటామని తేల్చిచెప్పారు. ఈ మేరకు శుక్రవారం ఆయన ఎక్స్ వేదికగా సర్కార్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. నల్లగొండ జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం శాలిగౌరానికి చెందిన రైతు తోట యాదగిరి గాంధీభవన్‌కు వచ్చి శుక్రవారం నిరసన వ్యక్తంచేశారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన రైతు రుణమాఫీ తనకు వర్తించలేదని, రైతు భరోసా సొమ్ము రాలేదని, సన్నవడ్లకు బోనస్ ఇవ్వలేదని గాంధీభవన్ సాక్షిగా తన రేవంత్ సర్కార్‌పై తోట యాదగిరి నిరసన వ్యక్తంచేశారు.
తాను 55 క్వింటాళ్ల 80 కిలోల ధాన్యాన్ని అమ్మితే తనకు ఒక్క రూపాయి బోనస్ రాలేదని యాదగిరి పేర్కొన్న ఉదంతాన్ని హరీశ్‌రావు ఉదహరించారు. రైతుభరోసా, రుణమాఫీ, బోనస్ ఇస్తామని అనేక విషయాలు చెప్పి ఇప్పుడు మాట మారుస్తున్న వైనానికి యాదగిరి అనుభవమే సాక్ష్యమని గుర్తుచేశారు. కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలు ఎన్నికల గారడీలేనని, 420 హామీల అమలు ఒట్టి బూటకమేనని తెలంగాణ ప్రజలు తకువ సమయంలోనే తెలుసున్నారని, యాదగిరి మాటలే అందుకు సాక్షీభూతమని పేర్కొన్నారు. రాష్ట్రంలోని ఒక్కో రైతు కాంగ్రెస్ పార్టీని నిలదీసేందుకు ఒకొకరుగా గాంధీభవన్‌కు చేరకముందే కాంగ్రెస్ పాలకులు పాపపరిహారం చేసుకోవాలని హరీశ్‌రావు సూచించారు. రైతులకు, మహిళలకు, విద్యార్థులకు, వృద్ధులకు, ఉద్యోగులకు ఇలా అన్నివర్గాలకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. ఇప్పుడు గాంధీభవన్‌కు వచ్చిన రైతులు రేపో, మాపో రేవంత్‌రెడ్డి ఉండే జూబ్లీహిల్స్ ప్యాలెస్ దాకా వస్తారనే విషయాన్ని గుర్తుంచుకోవాలని హెచ్చరించారు.
ప్యాలెస్ పాలన వదలండి
సీఎం రేవంత్‌రెడ్డి ప్యాలెస్ పాలన వదిలి ప్రజాపాలన కొనసాగించాలని మాజీ హరీశ్‌రావు సూచించారు. ఏడు పదుల వయసులో రుణమాఫీ కోసం బ్యాంకుల చుట్టూ తిరిగి, అధికారులను వేడుకున్నా ఫలితం లేని రైతులు గాంధీభవన్ వైపు అడుగులు వేస్తున్నారని ఉదహరించారు. ఇచ్చిన మాటను నిలుపుకోవాలని గుర్తుచేస్తూ తన ధర్మ నిరసనను తెలిపిన తోట యాదగిరిని హరీశ్ అభినందించారు. మోసపూరిత హామీలిచ్చిన కాంగ్రెస్‌పై పోరాడాలని, అందుకు యాదగిరిని స్ఫూర్తిగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో ఉన్న లక్షలాది మంది యాదన్నల కోసం బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రభుత్వంపై పోరాటాలు చేసి, కాంగ్రెస్ ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తుందని భరోసా ఇచ్చారు.