హైదరాబాద్ : టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. హైదరాబాద్ పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ అధ్యక్షతన సిట్‌ను ఏర్పాటు చేశారు. నల్లగొండ ఎస్పీ రెమా రాజేశ్వరి, సైబరాబాద్ క్రైమ్స్ డీసీపీ కమలేశ్వర్ సింగేనవర్, శంషాబాద్ డీసీపీ ఆర్ జగదీశ్వర్ రెడ్డి, నారాయణపేట ఎస్పీ వెంకటేశ్వర్లు, రాజేంద్రనగర్ డివిజన్ ఏసీపీ గంగాధర్, మొయినాబాద్ ఎస్‌హెచ్‌వో లక్ష్మీరెడ్డి సభ్యులుగా కొనసాగనున్నారు. దర్యాప్తు బృందం ఏర్పాటు చేస్తూ హోం శాఖ కార్యదర్శి బుధవారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేశారు.
టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనుగోలుచేసేందుకు ప్రయత్నించి బీజేపీ బ్రోకర్లు అడ్డంగా దొరికిపోయిన కేసును పోలీసులు దర్యాప్తు చేయవచ్చని హైకోర్టు తెలిపిన విషయం విదితమే. దర్యాప్తును నిలిపివేస్తూ గతంలో ఇచ్చిన ఉత్తర్వులను మంగళవారం కోర్టు రద్దు చేసింది. ఎంతో కాలంపాటు దర్యాప్తును వాయిదా వేయడం సబబు కాదని న్యాయమూర్తి జస్టిస్ బీ విజయసేన్‌రెడ్డి ధర్మాసనం స్పష్టం చేసింది. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ కేసుపై సత్వర దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉన్నదని పేరొన్నది. సమగ్రంగా, లోతుగా, సత్వరమే విచారణ నిర్వహిస్తామని పేర్కొంటూ తదుపరి విచారణను ఈ నెల 18కి వాయిదా వేసింది.
మొయినాబాద్‌లోని ఓ ఫాంహౌస్‌లో నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు బీజేపీ దళారులు రామచంద్రభారతి, కోరె నందకుమార్, సింహయాజి ప్రయత్నించిన సమయంలో పోలీసులు కుట్రను ఛేదించి వారిని అరెస్టుచేసిన విషయం తెలిసిందే. ఈ కేసును సీబీఐ లేదా హైకోర్టు ఏర్పాటుచేసే సిట్‌కు బదిలీ చేయాలని బీజేపీ నేత ప్రేమేందర్‌రెడ్డి రిట్ దాఖలు చేశారు. ము గ్గురు నిందితులు కూడా సీబీఐ దర్యాప్తు కోరుతూ రిట్ వేశారు. ఫోన్ల ట్యాపింగ్‌పై మరో పిటిషన్ దాఖలైంది. ఈ కేసులన్నింటిలోనూ రాష్ట్ర ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశించింది. రెండు వారాల సమయం కావాలని ప్రభుత్వం తరఫున అదనపు ఏజీ జే రామచంద్రరావు కోరారు. ఇందుకు ప్రతివాదుల తరఫు న్యాయవాది సీహెచ్ ప్రభాకర్ అభ్యంతరం చెప్తూ గడువు ఎకువ ఇవ్వవద్దని కోరారు. దీంతో విచారణను ధర్మాసనం ఈ నెల 18కి వాయిదా వేసింది.