న్యూఢిల్లీ: ప్రత్యామ్నాయ అటవీకరణ నిధులతో (కంపా) చేపడుతున్న అటవీ పునరుద్ధరణ పనులు తెలంగాణలో సత్ఫలితాలను ఇస్తున్నాయి. క్షీణించిన అటవీ ప్రాంతాల్లో అటవీ పునరుజ్జీవన పనుల ద్వారా మళ్లీ పచ్చదనం పెరుగుతున్నది. హైదరాబాద్‌కు అతి సమీపంలో రంగారెడ్డి జిల్లాలో పూర్తిగా పట్టణీకరణ జరిగిన ప్రాంతాల్లో 84 బ్లాకుల్లో 29,545 హెక్టార్ల అటవీ ప్రాంతం విస్తరించి ఉన్నది. పట్టణీకరణకు సమీపంలోని విలువైన అటవీ ప్రాంతాలను రక్షిస్తూ, మళ్లీ పచ్చదనం చిగురింపజేసే కార్యాచరణను అటవీ శాఖ అమలు చేస్తున్నది.
దీనివల్ల హైదరాబాద్ పరిసర వాసులకు ప్రకృతి, పచ్చదనం, స్వచ్చమైన గాలి లభిస్తాయి. రంగారెడ్డి జిల్లాలో ప్రత్యామ్నాయ అటవీకరణ చేపట్టిన ప్రాంతాల్లో అటవీ శాఖ ఉన్నతాధికారులు క్షేత్ర స్థాయిలో పరిశీలన చేశారు. పీసీసీఎఫ్ (కంపా) లోకేశ్ జైస్వాల్, అదనపు పీసీసీఎఫ్ సునీతా భగవత్ రంగారెడ్డి జిల్లాలో స్థానిక అధికారులతో కలిసి ఇబ్రహీంపట్నం, కందుకూరు, అమనగల్, శంషాబాద్, మంఖాల్ అటవీ రేంజ్‌లలో పర్యటించారు. ప్రతి డివిజన్లో రేంజ్‌ల వారీగా క్షేత్ర స్థాయిలో చేపట్టిన పనుల పురోగతి, నాణ్యతలను పరిశీలించారు.
గున్గల్ అటవీ రేంజ్ పరిధిలోని రెండు ప్రాంతాల్లో 160 హెక్టార్లలో.. గుమ్మడవళ్లి, మాదాపూర్ ప్రాంతాల్లో 105 హెక్టార్లలో.. పడ్కల్ రిజర్వు అటవీ ప్రాంతంలో 70 హెక్టార్లలో.. కొత్వాల్ గూడ, మల్కారంలలో 82 హెక్టార్లలో.. పల్లెగూడ రిజర్వు ఫారెస్ట్‌లో 57 హెక్టార్లలో అటవీ శాఖ కంపా నిధుల ద్వారా ప్రత్యామ్నాయ అటవీకరణ, అటవీ పునరుద్దరణ పనులను చేపట్టింది. గత మూడు, నాలుగేళ్లుగా నాటిన మొక్కల సంరక్షణతోపాటు, ఖాళీలు ఉన్నచోట్ల గ్యాప్ ప్లాంటేషన్ చేపడుతున్నారు.
అన్ని అటవీ ప్రాంతాల చుట్టూ ఆక్రమణల నివారణలో భాగంగా కందకాలు లేదా చైన్ లింక్ ఫెన్సింగ్ ఏర్పాటు, గట్లపైన గచ్చకాయ చెట్ల పెంపకం, భూసారం పెరిగేలా చర్యలు, చెక్ డ్యామ్‌లు, వర్షం నీటి నిలువ కోసం కందకాల తవ్వకం, నర్సరీల పెంపు, వంద శాతం అటవీ పునరుద్ధరణలో భాగంగా మొక్కలు నాటడం, తద్వారా అటవీ సాంద్రత పెంపు చర్యలను అటవీ శాఖ చేపట్టింది. రెండు రోజుల పర్యటనలో భాగంగా వివిధ ప్రాంతాల్లో పర్యటించిన పీసీసీఎఫ్ (కంపా) లోకేశ్ జైస్వాల్.. పనుల పురోగతి, నాణ్యతపై సంతృప్తి వ్యక్తంచేశారు. మరింత సమర్థవంతమైన ఫలితాలు రాబట్టడంపై పలు సలహాలు, సూచనలు చేశారు.
అటవీ పునరుద్ధరణ పనుల పర్యవేక్షణ కోసం చేపట్టిన ఈ పర్యటనలో రంగారెడ్డి చీఫ్ కన్జర్వేటర్ సునీతా భగవత్, ఆమనగల్, శంషాబాద్ ఫారెస్ట్ డివిజనల్ అధికారులు ఎం జానకిరామ్, విజయానంద్, స్థానిక ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్లు, సిబ్బంది పాల్గొన్నారు.