కృష్ణ కాలనీ, ఫిబ్రవరి 23: జయశంకర్ భూపాలపల్లి జిల్లా భూపాలపల్లి మండలంలోని ఆజంనగర్లో అటవీ అధికారులు రైతులపై విచక్షణారహితంగా దాడి చేయడం దారుణమని మానవ హకుల వేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఎస్ తిరుపతయ్య అన్నారు. ఇందుకు బాధ్యులైన అధికారులపై కేసులు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
35 ఏండ్లుగా పోడు భూమిని సాగు చేసుకుంటున్న 11 కుటుంబాల రైతులపై అటవీ అధికారులు మూకుమ్మడిగా దాడి చేసి గాయపరచగా, ఆ కుటుంబాలను ఆదివారం మానవ హకుల వేదిక బృందం పరామర్శించింది. గ్రామస్థులతో మాట్లాడి వాస్తవాలను సేకరించింది. వేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ తిరుపతయ్య మాట్లాడుతూ.. 35 సంవత్సరాలుగా గుంట భూమిలేని నిరుపేద రైతులు పోడు సాగు చేసుకుంటుండగా సుమారు 150 మంది అటవీశాఖ పోలీసులు వారిపై దాడి చేయడం హేయమైన చర్యగా పేర్కొన్నారు.