హైదరాబాద్, ఆగస్టు 14 (నమస్తే తెలంగాణ): తిరుమలలో అటవీశాఖ అధికారులకు ఓ చిరుత చిక్కింది. ఇటీవల అలిపిరి కాలినడక మార్గంలో చిరుత ఆరేండ్ల చిన్నారిని బలి తీసుకోగా, అటవీశాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. చిన్నారిపై దాడి చేసిన ప్రాంతంలోని నరసింహస్వామి ఆలయం వద్ద 3 బోన్లు, ట్రాప్ కెమెరాలు ఏర్పాటుచేశారు. ఆదివారం అర్ధరాత్రి బోనులో ఓ చిరుత చిక్కగా, ఎస్వీ జూపార్కుకు తరలించారు.
బోనులో ప్రవేశించే క్రమంలో చిరుత స్వల్పంగా గాయపడిందని, వైద్య పరీక్షలు నిర్వహిస్తామని అధికారులు వివరించారు. పట్టుబడిన చిరుత మ్యాన్ ఈటర్ అవునో.. కాదో? తెలుసుకునేందుకు పరీక్ష నిర్వహించనున్నట్టు ప్రకటించారు. కాగా, ట్రాప్ కెమెరాల్లో ఐదు చిరుతలు సంచరించిన దృశ్యాలు నమోదయ్యాయి. తిరుమల ఏడో మైలు, నామాలగవి, లక్ష్మీనరసింహస్వామి ఆలయ పరిసరాల్లో చిరుతలు సంచరిస్తున్నట్టు ఆ దృశ్యాల ద్వారా తెలిసింది. ఇదిలా ఉండగా, సోమవారం ఉదయం 2 వేల మెట్టు వద్ద భక్తులకు ఎలుగుబంటి కనిపించడంతో అటవీశాఖ, టీటీడీ విజిలెన్స్ సిబ్బందికి భక్తులను అప్రమత్తం చేశారు.