హైదరాబాద్ జూన్ 3 (నమస్తేతెలంగాణ): కేసీఆర్ హయాంలో చేపట్టిన హరితహారం కార్యక్రమం తెలంగాణలో హరిత విప్లవాన్ని సృష్టించిందని మాజీ మంత్రి హరీశ్‌రావు గుర్తుచేశారు. ఆయన ముందుచూపుతో చేపట్టిన ఈ కార్యక్రమంతో రాష్ట్రంలో 24 శాతంగా ఉన్న అటవీ విస్తీర్ణం 31 శాతానికి పెరిగిందని పేర్కొన్నారు. పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని గురువారం హరీశ్‌రావు గత బీఆర్ఎస్ ప్రభుత్వం పర్యావరణకు చేపట్టిన చర్యలను ఎక్స్ వేదికగా పంచుకున్నారు.
మొత్తంగా 250 కోట్ల మొక్కలు నాటి హరిత తెలంగాణగా తీర్చిదిద్దిన ఘనత కేసీఆర్‌కే దక్కుతుందని కొనియాడారు. ‘నాడు మేం ఆకుపచ్చని తెలంగాణగా సాకారం చేసి చూపాం.. అది మా దృఢ సంకల్పానికి, దార్శనికతకు నిదర్శనం’ అని ఉద్ఘాటించారు. కాంగ్రెస్ సర్కారు మాత్రం పర్యావరణ పరిరక్షణపై తీవ్ర నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తున్నదని విమర్శించారు. రూ.36 కోట్లు ఉన్న హరిత నిధిని రూ.17 కోట్లకు అంటే 53 శాతానికి తగ్గించడమే ఇందుకు నిదర్శనమని పేర్కొన్నారు. హెచ్‌సీయూలోని చెట్లను నరికివేసి పర్యావరణానికి హాని కలిగించిందని, రేవంత్ సర్కారు అనాలోచిత చర్యలకు ఎన్నో చెట్లు నేలకూలాయని ఆందోళన వ్యక్తంచేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వం పర్యావరణ విధ్వంసానికి పాల్పడుతూనే, పాలనపై అంతులేని నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తున్నదని దుయ్యబట్టారు. సుప్రీంకోర్టు ఆదేశాలను పాటించి అటవీ ప్రాంతాన్ని పునరుద్ధరించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ‘పర్యావరణ పరిరక్షణ ఓ నినాదం కాదు.. అది మనందరి బాధ్యత.. తెలంగాణ ప్రజల కోసం పోరాటం కొనసాగిస్తాం’ అని స్పష్టంచేశారు. ప్రజలందరూ హరితయజ్ఞంలో భాగస్వాములు కావాలని హరీశ్‌రావు పిలుపునిచ్చారు.