జూలూరుపాడు, ఆగస్టు 20: పంటకు పెట్టుబడి సాయం అందక ఓ కౌలు రైతు పురుగుల మందుతాగి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం శంభునిగూడెంలో మంగళవారం చోటుచేసుకున్నది. పోలీసులకథనం ప్రకారం.. గ్రామానికి చెందిన కౌలు రైతు వగ్గెల ప్రసాద్ (36) కొన్నేండ్లుగా అదే గ్రామంలో భూమిని కౌలుకు తీసుకొని వ్యవసాయం చేస్తున్నాడు. ఈ ఏడాది కూడా ఐదెకరాల భూమిని కౌలుకు తీసుకొని పత్తి పంట సాగు చేశాడు. మరో రెండు ఎకరాల భూమిలో వరి నాట్లు వేసేందుకు పెట్టుబడి సాయం కోసం తెలిసిన వారి వద్ద అప్పు అడిగినా పుట్టలేదు. దీంతోపాటు పత్తి పంటకు ఎరువులు, పురుగు మందులు పిచికారీ చేయాల్సి రావడంతో దానికి కూడా అప్పు లభించలే దు. దీంతో మనస్తాపం చెందిన ప్రసాద్ ఈ నెల 19న చేను వద్ద పురుగుల మం దు తాగాడు. గమనించిన కుటుంబ సభ్యులు కొత్తగూడెం ప్రభుత్వ దవాఖానకు తరలించగా.. చికిత్స పొందుతూ మంగళవారం మృతిచెందాడు. ప్రసాద్‌కు భార్య ఉషారాణి, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
వీధికుక్కల వీరంగం
శక్కర్‌నగర్, ఆగస్టు 20: నిజామాబాద్ జిల్లా బోధన్‌లోని తట్టికోట్ లో మంగళవారం వీధికుక్కలు బీభత్సం సృష్టించాయి. గర్భిణి, చిన్నారులు సహా 10మందిపై దాడి చేశాయి. కాలనీలో ఆడుకుంటున్న బాలుడిని లాక్కెళ్లేందుకు యత్నించగా స్థానికులు అడ్డుకున్నారు. గాయాలైన వారిని బోధన్ దవాఖానకు తరలించారు. వీధి కుక్కల బెడదను నియంత్రించాలని అధికారులు పట్టించుకోవడం లేదంటూ స్థానికులు ఆందోళనకు దిగారు. ప్రభుత్వ దవాఖాన ఎదుట రహదారిపై బైఠాయించారు. సమాచారం అందుకున్న సీఐ వీరయ్య అక్కడికి చేరుకుని కాలనీవాసులకు సర్దిచెప్పారు. కుక్కల నియంత్రణ చర్యలు చేపట్టకపోతే ఆందోళనను ఉధృతం చేస్తామని వారు హెచ్చరించారు.