హైదరాబాద్, సెప్టెంబర్ 27 (నమస్తేతెలంగాణ): ‘రూ.1.5 లక్షల కోట్ల దోపిడీ కోసమే మూసీ ప్రాజెక్టును తెరపైకి తెచ్చిన సీఎం రేవంత్‌రెడ్డి.. వరదల్లో హైదరాబాద్ నగర ప్రజలను నిండా ముంచిన్రు.. వరదలను నిరోధించేందుకే నిజాం ప్రభువు నాడు నిర్మించిన గండిపేట, ఉస్మాన్‌సాగర్ చెరువులను ఖాళీ చేయకుండా దురుద్దేశపూరిత నిర్లక్ష్యంచేసి వేలాది కుటుంబాలను రోడ్డుపాలు చేసిన్రు’ అంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన ఆరోపణలు చేశారు. మూసీ సుందరీకరణ ముసుగులో ప్రజాధనాన్ని లూటీ చేసేందుకే కిరాతంగా వ్యవహరించారని తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రేవంత్ సర్కారు చారిత్రాక తప్పిదంతోనే చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా మహాత్మాగాంధీ బస్‌స్టేషన్‌ను వరద ముంచెత్తిందని ధ్వజమెత్తారు. హైదరాబాద్ తెలంగాణ భవన్లో కొడంగల్ నియోజకవర్గానికి చెందిన 300 మంది కాంగ్రెస్, బీజేపీ నాయకులు శనివారం బీఆర్ఎస్ పార్టీలో చేరారు.
వారందరికీ కేటీఆర్ గులాబీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఇక్కడికి వచ్చిన కొడంగల్ వాసుల జోష్, ఊపు, ఉత్సాహం చూస్తుంటే వచ్చే ఎన్నికల్లో రేవంత్‌రెడ్డి ఓటమి భయంతో కొడంగల్ నుంచి పారిపోవడం పక్కా అని ఎద్దేవా చేశారు. రాష్ర్టానికి రేవంత్‌రెడ్డి ముఖ్యమంత్రి కావచ్చు కానీ, కొడంగల్‌కు మాత్రం ఆయన అన్న తిరుపతిరేడ్డే సీఎం అని వ్యాఖ్యానించారు. దగాచేసిన కాంగ్రె స్ సర్కారు పాలిట బీఆర్ఎస్ రూపొందించిన బాకీ కార్డు బ్రహ్మాస్త్రమని అభివర్ణించారు.
రైతుబిడ్డలకు రేవంత్ సోదరుల అవమానం
‘ఓ వైపు జేబులు నింపుకొనేందుకు గిరిజన రైతుబిడ్డలను అవమానించిన రేవంత్‌రెడ్డి, ఆయన సొదరుడు తిరుపతిరెడ్డి ఉన్నరు. మరోవైపు ఆపదలో అండగా నిలిచి రైతుల కోసం జైలుకుపోయిన పట్నం నరేందర్‌రెడ్డి ఉన్నడు. కొడంగల్ ఆడబిడ్డలు, అన్నాదమ్ములు ఆలోచించండి. విచక్షణతో వ్యవహరించి నిర్ణయం తీసుకోండి. తప్పు చేస్తే మళ్లీ మోసపోవడం తప్పదని గుర్తుంచుకోండి. నరేందర్‌రెడ్డి నిలబెట్టిన అభ్యర్థులను గెలిపించి, మోసం చేసిన కాంగ్రెస్ ఓటమికి నాంది పలకండి’ అంటూ కేటీఆర్ అభ్యర్థించారు.
కొడంగల్ గడ్డకు అవమానం
‘కేవలం కొడంగల్ నేల దయతోనే నువ్వు ఎమ్మెల్యేవు అయినవు తప్ప.. నువ్వు రాజువు, చక్రవర్తివి అనుకుంటే పొరపాటు. నీలాగా మాట్లాడినోళ్లెందరో పెద్దపెద్దోళ్లు ఓటమి చవిచూశారు. ఇట్లనే అడ్డంపొడుగు మాట్లాడితే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కొడంగల్ గడ్డ ఆగ్రహానికి నువ్వు, నీ కాంగ్రెస్ పార్టీ అడ్రస్ లేకుండా కొట్టుకుపోతది రేవంత్‌రెడ్డి గుర్తుపెట్టుకో జాగ్రత్త’ అంటూ తీవ్రస్థాయిలో హెచ్చరించారు. అల్లుడి ఫ్యాక్టరీ కోసం గిరిజన రైతుల పొట్టలుగొట్టేందుకు యత్నిస్తున్నారని ధ్వజమెత్తారు. ఆయన అరాచకాలను బీఆర్ఎస్ చూస్తూ ఊరుకోబోదని తేల్చిచెప్పారు. కొడంగల్ ఏమైనా రేవంత్‌రెడ్డి జాగీరా? ఆయనేమైనా రాజా? అని ప్రశ్నించారు. ఎట్టిపరిస్థితుల్లో ముఖ్యమంత్రి కుతంత్రాలను అడ్డుకుని రైతాంగానికి అండగా ఉంటామని స్పష్టంచేశారు.
కమీషన్ల కోసమే కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్
కేసీఆర్‌పై దుగ్ద, ఆయనకు మంచి పేరు వస్తుందనే ఉద్దేశంతోనే 90 శాతం పూర్తయిన పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని కాంగ్రెస్ పాలకులు పక్కనబెట్టారని కేటీఆర్ విమర్శించారు. కమీషన్ల కోసమే రూ.4,500 కోట్లతో కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్‌ను తెరపైకి తెచ్చారని నిప్పులు చెరిగారు. కొడంగల్ లిఫ్ట్ పేరిట ప్రజాధనాన్ని దండుకొనేందుకు కంకణం కట్టుకున్నారని మండిపడ్డారు. ఇందులో భాగంగానే లిఫ్ట్ పనులను మెగా కృష్ణారెడ్డి, బాంబులేటి శ్రీనివాస్‌రెడ్డికి కట్టబెట్టారని ఆరోపించారు. రేవంత్‌రెడ్డి దోపిడీ విధానం కోర్టుకు అర్థమయ్యే పనులను నిలిపివేస్తూ స్టే ఇచ్చిందని గుర్తుచేశారు.
కొడంగల్ నుంచే కేసీఆర్ జైత్రయాత్ర
‘రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఓటుతో బుద్ధిచెప్పాలి. ఎట్టిపరిస్థితుల్లో స్థానిక ఎన్నికల రూపంలో వచ్చిన అవకాశాన్ని వదులుకోవద్దు. కొడంగల్ నుంచే కాంగ్రెస్ ఓటమికి పునాది వేసి కేసీఆర్ జైత్రయాత్రకు శ్రీకారం చుట్టాలి’ అని కొడంగల్ ప్రజలకు కేటీఆర్ పిలుపునిచ్చారు. ఒకవేళ మూడేండ్లు ఆ పార్టీ అధికారంలో ఉంటదని పొరపాటున ఓటేస్తే మళ్లీ మోసపోయి గోసపడక తప్పదని హితవు పలికారు. ‘రెండు రోడ్లెయించుకుందామని, మూడు బోరింగ్లు వేయించుకుందాం’ అని ఆశపడితే అసలుకే ఎసరు వస్తుందనే విషయాన్ని గుర్తుంచుకోవాలని చెప్పారు. ‘ఒకవేళ తప్పుచేస్తే రెండేండ్లలో వృద్ధుల పింఛన్లు రెట్టింపు చేయకపోయినా, ఆడబిడ్డలకు నెలకు రూ.2,500 ఇవ్వకపోయినా, పెండ్లి చేసుకున్న అక్కాచెళ్లెల్లకు తులం బంగారం ఇవ్వకపోయినా, మాట తప్పినా, మోసంచేసినా తనకే ఓటేశారని.. వచ్చే మూడేండ్లు ఏమీ చేయకున్నా మళ్లీ వాళ్లే ఓటేస్తారని అనుకొనే ప్రమాదం ఉన్నది’ అని హెచ్చరించారు. కొడంగల్‌లో స్విచ్ ఆఫ్ చేస్తేనే ఢిల్లీలో లైట్లు బంద్ అవుతయ్.. అన్ని నియోజకవర్గాలు ఒక ఎత్తు మీ నియోజకవర్గం మరో ఎత్తు..ఇక్కడ రేవంత్‌రెడ్డికి తొడపాశం పెడితేనే ఢిల్లీ దద్దరిల్లుతుంది.. సొంత నియోజకవర్గం వాళ్లే నమ్మడంలేదు అనే విషయం వారి పార్టీ పెద్దలకు తెలిసిపోతుంది’అనే విషయాన్ని గుర్తుంచుకోవాలని కేటీఆర్ కోరారు.
అన్నివర్గాలకు సర్కార్ దగా
కాంగ్రెస్ 22 నెలల పాలనలో పుట్డిన బిడ్డ నుంచి పండుముసలి వరకు అన్ని వర్గాలు దగాపడ్డాయని మాజీ మంత్రి వీ శ్రీనివాస్‌గౌడ్ విమర్శించారు. రేవంత్‌రెడ్డి పాలనలో మళ్లీ సమై క్య రాష్ట్రంలోని పరిస్థితులు కనిపిస్తున్నాయని ఆవేదన వ్యక్తంచేశారు. సీఎం రేవంత్‌రెడ్డి నియోజకవర్గం కొడంగల్‌లో ఆయన సోదరుల అరాచకాలు పెచ్చరిల్లుతున్నాయని మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి విమర్శించారు.