Telangana | మంచిర్యాల, నవంబర్ 5 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): కాంగ్రెస్ పాలనలో గురుకులాలు భ్రష్టుపట్టిపోయాయి. సంక్షేమ హాస్టళ్లంటేనే విద్యార్థుల్లో వణుకుపుడుతున్నది. వరుస ఘటనలతో తల్లిదండ్రులూ భయపడుతున్నారు. గురుకులాల్లో ఉన్న విద్యార్థులూ బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఫుడ్‌పాయిజన్‌తో వందలాది మంది విద్యార్థులు అస్వస్థతకు గురవ్వగా.. ఓ విద్యార్థి మృతి చెందడమే అందుకు కారణం. 11 నెలల పాలనలో గురుకులాల్లో వివిధ ఘటనల్లో పలువురు విద్యార్థులు మృతి చెందారు. ఫుడ్‌పాయిజన్‌తో యాదాద్రి భువనగిరి గురుకుల పాఠశాలలో ఏడో తరగతి చదువుతున్న ప్రశాంత్(13) అనే విద్యార్థి మరణించిన విషయం తెలిసిందే. వరుస ఘటనలు జరిగినప్పుడే ప్రభుత్వం స్పందించి తగిన చర్యలు తీసుకొని ఉంటే గురుకులాలు మెరుగయ్యేవి. తాజాగా కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలో మరో ఘటన చోటు చేసుకున్నది. వాంకిడి ఆశ్రమ పాఠశాలలో ఫుడ్‌పాయిజన్‌తో 60మంది విద్యార్థినులు వాంతులు, విరేచనాలతో అస్వస్థతకు గురయ్యారు. అందులో ముగ్గురిని నిమ్స్‌కు తరలించగా ఓ విద్యార్థిని ప్రస్తుతం వెంటిలేటర్‌పై చావుబతుకులతో పోరాడాల్సిన పరిస్థితి వచ్చింది.
భయాందోళనలో విద్యార్థునుల తల్లిదండ్రులు
కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి గిరిజన బాలికల ఆశ్రమ ఉన్నత పాఠశాలలో అక్టోబర్ 31 దీపావళి రోజున ఫుడ్‌పాయిజన్ జరిగింది. మొదట 30 మంది విద్యార్థినులు వాంతులు, విరేచనాలతో అస్వస్థతకు గురయ్యారు. రెండు, మూడు రోజుల్లో బాధిత విద్యార్థినుల సంఖ్య 60కి చేరింది. 31న రాత్రి కొంతమంది విద్యార్థులను వాంకిడి పీహెచ్‌సీకి తీసుకెళ్లి చికిత్స అందించారు. అక్కడా ఫలితం లేకపోవటంతో నవంబర్ 1న ఆసిఫాబాద్ జిల్లా దవాఖానకు, అదే రోజు రాత్రి మంచిర్యాల ప్రభుత్వ హాస్పిటల్‌కు తీసుకెళ్లారు. ఆరోగ్యం మెరుగుపడని ఆరుగురు విద్యార్థినులను మంచిర్యాలలోనే ఓ ప్రైవేట్ దవాఖానలో చేర్పించి వైద్యం అందించారు. ఇలా విద్యార్థినులను దవాఖానల చుట్టూ తిప్పిస్తూ వారి ప్రాణాలతో అధికారులు చెలగాటమాడారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
మంచిర్యాల ప్రైవేట్ దవాఖానలో చేరిన ఆరుగురిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉండడంతో మహాలక్ష్మి (8వ తరగతి), జ్యోతి (9వ తరగతి)ని సోమవారం నిమ్స్‌కు పంపించారు. జ్యోతి కిడ్నీల్లో క్రియాటిన్ లెవల్స్ పెరిగినట్టు గుర్తించిన వైద్యులు ఆమెకు డయాలసిస్ చేసి, చికిత్స అందించారు. ప్రస్తుతం జ్యోతి పరిస్థితి కుదుటపడుతున్నదని రెండు,మూడు రోజుల్లో పూర్తిగా కోలుకుంటుందని కుటుంబసభ్యులు తెలిపారు. మరో విద్యార్థిని మహాలక్ష్మి సైతం కోలుకుంటున్నట్టు తెలిసింది. కాగా, మంచిర్యాల ప్రైవేట్ దవాఖానలో వెంటిలేటర్‌పై చికిత్స పొందిన చౌదరి శైలజ ఆరోగ్య పరిస్థితి కుదుటపడకపోవడంతో మంగళవారం ఉద యం ఆమెను సైతం నిమ్స్‌కు తరలించారు. ఈ అమ్మాయికి సైతం కిడ్నీల్లో క్రియాటిన్ లెవల్స్ పెరుగుతున్నట్టు వైద్యులు చెప్పారని కుటుంబసభ్యులు తెలిపారు. ప్రస్తుతం వెంటిలేటర్‌పై ఉన్న శైలజ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలిసింది. ఈ క్రమంలో ఆశ్రమ పాఠశాలలో ఫుడ్ పాయిజన్‌కు గురైన బాధిత విద్యార్థినుల కుటుంబసభ్యులు ఆందోళన చెందుతున్నారు. కాగా, పాఠశాలలో 590 మంది విద్యార్థినులుండగా.. ఫుడ్ పాయిజన్ ఘటనతో తల్లిదండ్రులు తమ పిల్లలను తీసుకెళ్తున్నారు. ప్రస్తుతం 100మంది విద్యార్థినులు కూడా పాఠశాలలో లేరని సిబ్బంది చెప్పారు.
మంత్రి కొండా సురేఖ నిందలు
నిమ్స్‌లో విద్యార్థులను పరామర్శించిన అనంతరం కొండా సురేఖ మాట్లాడిన తీరుపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతున్నది. ఇంటి నుంచి తెచ్చుకున్న అప్పాలు తినడంతోనే పిల్లలు అస్వస్థతకు గురయ్యారని తెలిపారు. ఇదిలా ఉండగా, మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు విద్యార్థినులను పరామర్శించిన క్రమంలో ‘హాస్టల్లో అన్నం బాగా లేదు.. నూకల అన్నంపెట్టారు.. అది తిన్న వెంటనే వాంతులు అయ్యాయి’ అని విద్యార్థినులు వివరించారు. ఒకవైపు బాధిత విద్యార్థులే వారు తిన్న ఆహారంపై వివరణ ఇవ్వగా, మంత్రి అందుకు భిన్నంగా నిందలు వేస్తూ మాట్లాడటం విశేషం.
సమీక్షించని సీఎం..
గిరిజన సంక్షేమ శాఖను తనవద్దే అంటిపెట్టుకున్న సీఎం రేవంత్‌రెడ్డి దాదాపు 450మంది విద్యార్థినులు ఫుడ్‌పాయిజన్‌తో అస్వస్థతకు గురైనా పట్టించుకోలేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇదిలా ఉండగా మంచిర్యాల జిల్లాకు చెందిన ఎమ్మెల్యే సోమవారం పలు సంక్షేమ హాస్టళ్ల విద్యార్థులను సీఎం రేవంత్‌రెడ్డి వద్దకు తీసుకెళ్లి.. డైట్ చార్జీల పెంపుపై కృతజ్ఞతలు చెప్పించారు. అదే సమయంలో తమ ప్రభుత్వం విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తీసుకొస్తున్నట్టు సీఎం విద్యార్థులకు చెప్పారు. కానీ, నాలుగైదు రోజులుగా మంచిర్యాల పక్కనే ఉండే ఆసిఫాబాద్ జిల్లాలో ఆశ్రమ పాఠశాల విద్యార్థినులు అస్వస్థత గురైన విషయం సీఎంకు తెలియదా? తెలిసినా లైట్‌గా తీసుకున్నారా? అనేది సర్వత్రా చర్చ జరుగుతున్నది. మరోవైపు విద్యార్థులు అస్వస్థతకు గురైనప్పటికీ సర్కారు పట్టించుకోకపోవడంపై తల్లిదండ్రులు మండిపడుతున్నారు.
సర్కారు తీరును గిరిజన సంఘాల నాయకులు సైతం తప్పుబడుతున్నారు. నిరుపేద గిరిజన విద్యార్థుల ఆరోగ్యంపై ప్రభుత్వం చిన్నచూపు చూస్తున్నదని భగ్గుమంటున్నారు.
సర్కారును కదిలించిన హరీశ్
హైదరాబాద్, నవంబర్ 5 (నమస్తే తెలంగాణ): ఫుడ్‌పాయిజన్‌తో తీవ్ర అస్వస్థతకు గురై నిమ్స్‌లో చికిత్స పొందుతున్న ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి ఆశ్రమ పాఠశాల విద్యార్థినులను మాజీ మంత్రి హరీశ్‌రావు పరామర్శించటంతో సర్కారులో కదలిక వచ్చింది. వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్న విద్యార్థి శైలజతోపాటు తీవ్ర అస్వస్థతకు గురైన జ్యోతి, మహాలక్ష్మిని మాజీ మంత్రి మంగళవారం ఉదయం పరామర్శించారు. స్వయంగా వారితో మాట్లాడి భరోసా ఇచ్చారు. మెరుగైన చికిత్స అందించాలని వైద్యులకు సూచించారు. ఈ విషయం తెలుసుకున్న సర్కారు అప్రమత్తం అయ్యింది. అప్పటి వరకు రాహుల్‌గాంధీ పర్యటనలో బిజీబిజీగా ఉన్న మంత్రులు పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ హడావుడిగా దవాఖానకు చేరుకున్నారు. చికిత్స పొందుతున్న విద్యార్థినులతో మాట్లాడారు. ఆ తర్వాత వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ నిమ్స్ డైరెక్టర్ బీరప్పతో ఫోన్లో మాట్లాడి విద్యార్థులకు మెరుగైన చికిత్స అందించాలని ఆదేశించారు.
మా బిడ్డ పానాలు కాపాడుండ్రి సారు
మా బిడ్డ శైలజ. అక్టోబర్ 31న నా బిడ్డకు ఆరోగ్యం బాగోలేదని పాఠశాల నుంచి ఫోన్ వచ్చింది. వాంకిడి దవాఖానలో చూపించి మరునాడే ఆసిఫాబాద్ ప్రభుత్వ దవాఖానకు తీసుకుపోయిండ్రు. అక్కడా ఆరోగ్యం మెరుగుపడలేదని అదే రోజు రాత్రి మంచిర్యాల దవాఖానకు పంపిండ్రు. అక్కడి నుంచి మంచిర్యాలలోనే ఓ ప్రైవేట్ దవాఖానకు తీసుకెళ్లిండ్రు. నాలుగు రోజులు వెంటిలేటర్ మీద ఉంచిండ్రు. మళ్లీ మంగళవారం పొద్దున హైదరాబాద్ నిమ్స్‌కు పంపిండ్రు. ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా వెంటిలేటర్ మీదనే ఉంచిండ్రు. నా బిడ్డ ముక్కులో పైపులు పెట్టిండ్రు. ఏం మాట్లాడే పరిస్థితి లేదు. డాక్టర్లను అడిగితే ఆమె కిడ్నీల్లో నీరు వచ్చిందని చెబుతుండ్రు. ఆపరేషన్ ఏం అవసరం లేదు. ఇలా ఉంచితే మంచిగైతదని అంటున్నరు. మేం చిన్న పనులు చేసుకునే రైతులం. వాంకిడి మండలం దాబా మా ఊరు. తిన్న అన్నంలోనే ఏదో కలిసి ఇబ్బంది అయ్యిందంటున్నరు. ఏం చేయాలో అర్థమైతలేదు. నా బిడ్డ దగ్గరికే పోనిస్తలేరు. ఒక్కరే ఉండాలంటున్నరు. ఏమైందో చెప్పే పరిస్థితిలో నా బిడ్డ లేదు. మా బిడ్డ పానాలు కాపాడుండ్రి సారు.
– తుకారాం-మీరాబాయి, శైలజ తల్లిదండ్రులు
ఆరు రోజులైనా విద్యార్థినుల్లో సమస్య..
ఫుడ్ పాయిజన్‌తో 60మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. ప్రస్తుతం 21 మంది దవాఖానల్లో చికిత్స పొందుతున్నారు. మంగళవారం ఆరుగురు డిశ్చార్జి అవుతున్నారు. ఇంకా 16 మంది ఉంటారు. ఫుడ్‌పాయిజన్ జరిగి ఆరు రోజులు అయినా ఇంకా కొందరు విద్యార్థులకు వాంతులు, విరేచనాలు అవుతున్నాయి. ఇవాళ కూడా కొందరిని స్థానిక పీహెచ్‌సీకి పంపించాం. చౌదరి శైలజ పరిస్థితి కొంచెం క్రిటికల్‌గా ఉన్నది. ఆమె కోలుకోవాలని కోరుకుంటున్నాం.
– శ్రీనివాస్, ప్రిన్సిపాల్, వాంకిడి ఆశ్రమ పాఠశాల
విద్యార్థుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ
వాంకిడి ఆశ్రమ పాఠశాల విద్యార్థుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నాం. ముగ్గురికి నిమ్స్‌లో చికిత్స అందిస్తున్నాం. 10 మంది విద్యార్థులను డిశ్చార్జి చేయనున్నారు. దవాఖానలో చేరిన విద్యార్థులకు వైద్యం, వారి కుటుంబసభ్యులకు ఆహారం, ఇతర ఖర్చులు మొత్తం గిరిజనాభివృద్ధి సంస్థనే చెల్లిస్తుంది. సీఎం రేవంత్‌రెడ్డి, జిల్లా ఇన్చార్జి మంత్రి సీతక్క విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. తాగునీటిలో ఎలాంటి కలుషిత సంకేతాలు లేవని తేలింది. ఆహారానికి సంబంధించిన పరీక్షల ఫలితం రావాల్సి ఉన్నది.
– ఖుష్బూగుప్తా, ఐటీడీఏ పీవో