హైదరాబాద్, జూలై 17 (నమస్తే తెలంగాణ): గురుకులాలు.. నిరుపేద చిన్నారులకు బంగారు భవిష్యత్తు చూపే విద్యాలయాలు. కానీ, నేడు గురుకులాలు విషాహారానికి కేరాఫ్ అడ్రస్‌గా, కల్తీ ఆహారం.. ఫుడ్ పాయిజన్లకు అడ్డాగా మారాయనే విమర్శలొస్తున్నాయి. విద్యార్థులకు పురుగులన్నమే ప్రసాదమైంది. బల్లి, జెర్రీ, బొద్దింకలు పడ్డ కూరలు, అన్నం.. కుళ్లిన కోడిగుడ్లు దిక్కయ్యాయి. ఇది తిన్న విద్యార్థులు వాంతులు, విరేచనాలు, కడుపునొప్పి బారినపడుతున్నారు. దీంతో నిత్యం ఏదో ఒక గురుకులంలో విద్యార్థులు అస్వస్థతకు లోనై, దవాఖానల్లో చేరాల్సి వస్తున్నది. గురుకులాలు, కేజీబీవీలు, ఆశ్రమపాఠశాలలు, సర్కారు బడుల్లో ఎక్కడ చూసినా ఫుడ్ పాయిజన్లు నిత్యకృత్యమయ్యాయి.
సోషల్వెల్ఫేర్, మైనార్టీ, బీసీ, ఎస్టీ గురుకులం ఏదీ చూసినా అదే పరిస్థితి. వరుసగా ఒకదాని వెంట ఒకటి. ఆహారం కలుషితం కావడం, విద్యార్థులు దవాఖాన పాలుకావడం, పరిస్థితి విషమించి ప్రాణాలను కోల్పోవడం రాష్ట్రంలో సర్వసాధారణమైంది. తాజాగా రెండు రోజుల క్రితం నల్లగొండ జిల్లా ముదిగొండ గిరిజన ఆశ్రమ పాఠశాలలో కలుషితాహారం తిని 35 మంది బాలికలు దవాఖాన పాలయ్యారు. చికెన్, బగారా తిన్న విద్యార్థులు కొందరు అకస్మాత్తుగా కండ్లు తిరిగిపడిపోయారు. 35 మందిని దవాఖానలో చేర్పించాల్సి వచ్చింది. పరిస్థితులు చూస్తుంటే.. పిల్లల ఎదుగుదలకు నాణ్యమైన పోషకాహారం పెట్టాల్సిన సర్కారు విద్యార్థులకు విషం పెడుతున్నదనే అపప్రదను మూటగట్టుకుంటున్నది. అసలు గురుకులాల్లోని విద్యార్థులకు ఫుడ్ ఇస్తున్నారా? పాయిజన్ ఇస్తున్నారా? అని ప్రశ్నించుకోవాల్సినంతగా పరిస్థితులు దిగజారుతున్నాయి.
కాంగ్రెస్ పాలనలో గురుకులాలు అస్తవ్యవస్థమయ్యాయి. సంక్షేమం, చదవులు.. సమస్తం.. సమస్యల అడ్డాగా మారాయి. ఈ ఏడాది కాలంలోనే వెయ్యి మంది వరకు విద్యార్థులు విషాహారం బారినపడ్డారు. అనారోగ్యం పాలయ్యారు. ముగ్గురు విద్యార్థులు మృత్యువాత పడ్డారు. భువనగిరిలోని సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ వల్ల సీహెచ్ ప్రశాంత్ అనే విద్యార్థి మృతి చెందాడు. ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి గురుకులం విద్యార్థిని శిరీష ప్రాణాలు కోల్పోయింది. ప్రాణాలు కాపాడేందుకు నిమ్స్‌కు తరలించినా ఉపయోగం లేకుండా పోయింది. 2024 జనవరి 22న నల్లగొండ జిల్లా కొండమల్లేపల్లి ఎస్సీ గురుకులంలో 9వ తరగతి విద్యార్థిని భార్గవి ప్రార్థన సమయంలో కింద పడిపోయింది. వైద్యశాలకు తరలించగా, అప్పటికే మృతి చెందింది. విషాహారాన్ని నివారించేందుకు ఆహారభద్రత కమిటీ, టాస్క్‌ఫోర్స్‌లను ఏర్పాటుచేసినా పరిస్థితి మెరుగుపడలేదు. రోజుకో చోట ఫుడ్ పాయిజన్ ఘటనలు వెలుగుచూస్తూనే ఉన్నాయి. అయినా ప్రభుత్వం చోద్యం చూస్తున్నది తప్ప దిద్దుబాటు చర్యలు చేపట్టడంలేదు.
ఫుడ్ పాయిజన్ ఘటనలపై గతంలో హైకోర్టు సీరియస్ అయ్యింది. అధికారులు నిద్రపోతున్నారా? అని ప్రశ్నించింది. ‘ఫుడ్ పాయిజన్ తీవ్రమైన అంశం. వారంలో మూడుసార్లు భోజనం వికటిస్తే అధికారులేం చేస్తున్నారు. పిల్లలు చనిపోతే తప్ప స్పందించరా? ఇది అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనం. రాష్ట్ర ప్రభుత్వం సీరియస్‌గా తీసుకోవడంలేదు. హైకోర్టు ఆదేశాలు ఇస్తేనే అధికారులు పనిచేస్తారా? అధికారులకు పిల్లలున్నారు కదా.. మానవతా దృక్పథంతో వ్యవహరించాలి’ అని వ్యాఖ్యానించింది.
పాఠశాలల్లో, రెసిడెన్షియల్ స్కూల్స్‌లో పంపిణీచేస్తున్న అన్నం, కూరగాయలు నాసిరకంగా ఉన్నాయి. ఈ నాసిరకమైన భోజనాల వల్ల విద్యార్థుల ఆరోగ్యం దెబ్బతింటున్నది. రోజూ మనం టీవీల్లో, పేపర్లలో చూస్తున్నం. కలుషితమైన ఆహారం తీసుకుని రెసిడెన్షియల్ స్కూళ్లల్లో పిల్లలు దవాఖాన పాలవుతున్నరు.
-వేములవాడ సభలో సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలు
ఈ మధ్యకాలంలో మనం చూస్తే ఫుడ్ పాయిజన్లు, విద్యార్థులు అస్వస్థతకు గురవుతున్నారు. కొన్ని జరిగిన మాట వాస్తవం. ఈ ప్రజా ప్రభుత్వం వచ్చినంకనే ఇవి జరగలేదు. ఇది చాలా ఏండ్లుగా కొనసాగుతున్నది. వేల మంది అస్వస్థతలకు గురవడం వాస్తవం.
– అసెంబ్లీలో మంత్రి సీతక్క