కేసముద్రం, జనవరి 30: మహబూబాబాద్ జిల్లా కేసముద్రం గిరిజన గురుకుల సంక్షేమ పాఠశాలలో ఫుడ్ పాయిజన్ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ప్రిన్సిపాల్, వార్డెన్ విద్యార్థినిని ఇంటికి పంపించి అక్కడే అస్వస్థతకు గురైనట్టుగా చిత్రీకరించే యత్నం చేశారు. పాఠశాలలో ఈ నెల 28న విద్యార్థినులకు జీరా రైస్ అందించారు. 6వ తరగతి చదువుతున్న అలావత్ సంజన వాంతులు చేసుకుంది.
తోటి విద్యార్థులు నర్స్ వద్దకు తీసుకెళ్లగా ట్యాబ్లెట్స్ అందించారు. ఉపాధ్యాయులు సంజన తండ్రి రవికి సమాచారం అందించగా ఆయన వచ్చి కుమార్తెను ఇంటికి తీసుకువెళ్లాడు. సంజనకు అస్వస్థత తగ్గకపోవడంతో ఈ నెల 29న కేసముద్రంలోని ప్రైవే ట్ దవాఖానలో చేర్పించారు. మెరుగైన వై ద్యం కోసం గురువారం మహబూబాబాద్‌లో ని ఏరియా హాస్పిటల్‌కు తీసుకువచ్చారు. ప్రి న్సిపాల్కు ఫోన్ చేయగా స్పందించలేదు.
ఈ నెల 28న ఉదయం జీరా రైస్ ఇచ్చారు. అసెంబ్లీ సమయం కావస్తుండడంతో తొందరలో తింటుండగా అన్నంలో పురుగు కనిపించింది. దీంతో వాంతులు చేసుకున్నాను. మా నాన్నను పిలిపించి ఇంటికి పంపించారు. కేసముద్రంలో ప్రైవేట్ దవాఖానలో చికిత్స చేయించుకున్నా తగ్గకపోవడంతో మహబూబాబాద్ తీసుకొచ్చారు. నాతో పాటు మరో 10 మంది విద్యార్థినులకు వాంతులయ్యాయి. -సంజన, విద్యార్థిని