Gurukula Schools | మంచిర్యాల, నవంబర్ 6(నమస్తే తెలంగాణ ప్రతినిధి): మళ్లీ మరో ప్రభుత్వ ఆశ్రమ పాఠశాలలో ఫుడ్ పాయిజన్ అయింది. మంచిర్యాల జిల్లాలో బుధవారం 12 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురికాగా, వారిని ప్రభుత్వ దవాఖానకు తరలించారు. మంచిర్యాల పట్టణం సాయికుంట బాలికల గిరిజన ఆశ్రమ పాఠశాలలో బుధవారం ఉదయం పెట్టిన కిచిడీ తిన్న విద్యార్థినులు 12 మంది అస్వస్థతకు గురయ్యారు. పదో తరగతి విద్యార్థినులు ఉదయం 7 గంటలకు కిచిడీ తిన్నారు.
పాఠశాలలో ఉదయం 11 గంటల సమయంలో క్లాస్‌లు నడుస్తుండగా వాంతులు మొదలయ్యాయి. ఒకరి తర్వాత ఒకరు రెండు, మూడుసార్లు వాంతులు చేసుకోవడంతో వారిని పాఠశాల సిబ్బంది మంచిర్యాల ప్రభుత్వ దవాఖానకు తరలించారు. చికిత్స అనంతరం విద్యార్థినులు కుదుటపడ్డారు. వారిని అబ్జర్వేషన్లో ఉంచామని, భయపడాల్సిన అవసరం లేదని అందరూ ఆరోగ్యంగానే ఉన్నారని వైద్యులు తెలిపారు. ఫుడ్ పాయిజన్ గురించి తెలుసుకున్న మంచిర్యాల కలెక్టర్ కుమార్‌దీపక్ హుటాహుటిన దవాఖానకు వచ్చి విద్యార్థినులు, వైద్యులతో మాట్లాడారు.
అస్వస్థతకు గురైన అందరూ పదో తరగతి విద్యార్థినులని చెప్పారు. బయటి నుంచి ఏదైనా తీసుకొచ్చి తిన్నారా? అని వారిని అడిగితే, తినలేదనే చెప్పారని కలెక్టర్ తెలిపారు. పిల్లలు తిన్న ఆహారం ఫుడ్ శాంపిల్స్‌తోపాటు పాఠశాలలోని తాగునీటి శాంపిల్స్‌ను సేకరించి పరీక్షలకు పంపించినట్టు వెల్లడించారు. ఆ ఫలితాలు వచ్చిన తరువాత బాధ్యులపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. పండుగలకు ఇంటికి వెళ్లి వచ్చిన విద్యార్థినులు బయటినుంచి ఏదైనా ఫుడ్ తీసుకొచ్చారా? అనే కోణంలో చెక్ చేయాలని వార్డెన్లను ఆదేశించినట్టు తెలిపారు. ప్రత్యేక వైద్య సిబ్బందితో పిల్లలను పర్యవేక్షిస్తున్నామని చెప్పారు. అస్వస్థతకు గురైన విద్యార్థినులు మాత్రం తమకు ఉడకని లూస్‌గా ఉన్న కిచిడీతోపాటు చింతపులుసు పెట్టారని వెల్లడించారు. హాస్టల్లో వండే ఆహారం పూర్తిగా ఉడకకుండానే పెడుతున్నారని, రోజూ ఇదే పరిస్థితి ఉన్నదని ఆవేదన వ్యక్తంచేశారు.
మంచిర్యాల గిరిజన ఆశ్రమ పాఠశాలలో విద్యార్థినులు ఫుడ్ పాయిజన్‌కు గురయ్యారని తెలిసి ఉట్నూర్ ఐటీడీఏ పీవో ఖుష్బూగుప్తా ఆరా తీశారు. పాఠశాల ప్రిన్సిపాల్ మాధవ్ ముందస్తు పర్మిషన్ లేకుండా లీవ్‌లో ఉన్నట్టు గుర్తించి, వెంటనే సదరు ప్రిన్సిపాల్‌ను సస్పెండ్ చేసినట్టు ఆమె తెలిపారు. అనధికారికంగా లీవ్‌లో వెళ్లడం క్షమించరాని నేరమని, ఇలా ఎవరు చేసినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
అస్వస్థతకు గురైన 12 మంది పిల్లలు 10వ తరగతి చదువుతున్నారని, వారు ఇంటి నుంచి తెచ్చుకున్న పచ్చడిని కిచిడీలో కలుపుకుని తినడంతో ఇబ్బంది వచ్చిందని చెప్పారు. పిల్లలు తిన్న ఆహారంతోపాటు ఆ పచ్చడి శాంపిల్స్‌ను టెస్టులకు పంపినట్టు వెల్లడించారు. గిరిజన గురుకుల ఆశ్రమ పాఠశాలల్లో పని చేసే ఉపాధ్యాయులు, వార్డెన్లు ఎవరికి వారు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తుండటంతోనే విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
విద్యార్థినులు అస్వస్థతకు గురైన పాఠశాల ప్రిన్సిపాల్ లీవ్‌లో ఉన్నారన్న విషయం ఉన్నతాధికారులకు తెలియకపోవడం ఏమిటని విద్యార్థి సంఘాల నేతలు ప్రశ్నిస్తున్నారు. ఇది పర్యవేక్షణలోపమేనని ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. విధి నిర్వహణలో బాధ్యతారహితంగా వ్యవహించిన ప్రిన్సిపాల్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి గిరిజన ఆశ్రమ పాఠశాలలో విష ఆహారం తిన్న విద్యార్థుల అస్వస్థత ఘటన మరచిపోక ముందే, మంచిర్యాల ఘటన జరగడంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.
రాష్ట్రంలోని గురుకుల, ఆశ్రమ పాఠశాలల్లో విద్యార్థుల ఫుడ్ పాయిజన్ కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. అధికారుల నిర్లక్ష్యంతోనే ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. మెస్‌చార్జీలు పెంచి, నాణ్యమైన భోజనం పెడుతున్నాక కూడా విద్యార్థులు ఎందుకు దవాఖానల పాలవుతున్నారో ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలి. ప్రభుత్వ హాస్టళ్లలో ఉండే విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించే దిశగా ఆలోచన చేయాలి.
– చెన్నూర్ సమ్మయ్య, మంచిర్యాల జిల్లా ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు