ఇల్లంతకుంట, జూలై 17 : సాగుకు నీళ్లియ్యకపోతే మధ్యమానేరును ముట్టడిస్తామని రైతులు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఓ వైపు కాలం కాకపోవడం.. మరో వైపు ఎత్తిపోతలు ప్రారంభించకపోవడంతో వేలాది టీఎంసీల గోదావరి జలాలు వృథాగా దిగువకు వెళ్తుండటంతో ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. నార్లు ముదురుపోతున్నాయని వెంటనే సాగునీరు అందించాలని డిమాండ్ చేస్తూ గురువారం రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం పొత్తూరులోని బ్రిడ్జిపై పొత్తూరు, వల్లంపట్ల, ఓగులాపూర్, వంతడుపుల, గాలిపెల్లి, నర్సక్కపేట, జవారుపేట, రంగంపేట గ్రామాల రైతులు బీఆర్ఎస్ నాయకులతో కలిసి ధర్నా నిర్వహించారు. ప్రజా ప్రభుత్వమంటూ అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సర్కార్ తమను నట్టేట ముంచుతున్నదని మండిపడ్డారు. వానలు పడుతున్నా.. నీళ్లెందుకు ఎత్తిపోయడం లేదని ప్రశ్నించారు.
కాళేశ్వరం ప్రాజెక్టును తప్పుదోవ పట్టించేందుకే ఎత్తిపోతలు ప్రారంభించకుండా తమను బలిపశువులను చేస్తున్నారని మండిపడ్డారు. జడ్పీ మాజీ వైస్ చైర్మన్ సిద్ధం వేణు మాట్లాడుతూ.. బీఆర్ఎస్ హయాంలో ప్రతి ఎకరాకు సాగునీరందించి బీడుభూములను సస్యశ్యామలం చేశామని తెలిపారు. మానకొండూర్ ఎమ్మెల్యే కవ్వంపెల్లి సత్యనారాయణ వెంటనే స్పందించి రైతులకు ఎత్తిపోతల ద్వారా సాగునీరు అందించాలని డిమాండ్ చేశారు. లేదంటే రైతులతో కలిసి మధ్యమానేరు ప్రాజెక్టును ముట్టడిస్తామని హెచ్చరించారు.