ఆయన ఉద్యమకారుడు. తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని ఎండగట్టారు. కార్పొరేటర్ పదవికి రాజీనామా చేసి, ఉద్యమ సారథి అడుగుజాడల్లో నడిచాడు. కేసీఆర్ పిలుపునిచ్చిన ప్రతి కార్యక్రమాన్నీ విజయవంతం చేశారు. ఎంతో మందిని ఉద్యమం వైపు ఉన్ముఖులను చేశారు. హైదరాబాద్ నగరంలో ఉద్యమాన్ని ఉర్రూతలూగించారు. అతనిపై అనేక కేసులు పెట్టినా అదరలేదూ బెదరలేదు.. ఉద్యమమే ఊపిరిగా ముందుకు సాగారు. తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. దశాబ్దాలుగా ప్రజల మధ్యనే ఉంటున్న డిప్యూటీ స్పీకర్ తీగుల్ల్ల పద్మారావుగౌడ్‌ను నియోజకవర్గ ప్రజలు పజ్జన్న అని ఆప్యాయంగా పిలుస్తారు.
తీగుల్ల పద్మారావుగౌడ్ సికింద్రాబాద్ మోండా మార్కెట్లోని టకార బస్తీకి చెందినవారు. పేద కుటుంబంలో జన్మించారు. అంచెలంచెలుగా ఎదుగుతూ రాజకీయాల్లో రాణించాడు. కేసీఆర్ చేస్తున్న ప్రత్యేక తెలంగాణ ఉద్యమానికి ఆకర్షితుడై టీఆర్ఎస్ పార్టీలో చేరారు. రైల్‌రోకో, రాస్తారోకోలను కేటీఆర్‌తో కలిసి చేశారు. ఆ సమయంలో ప్రభుత్వం ఆయనపై అనేక కేసులను పెట్టింది. అయినా.. మొక్కవోని దీక్షతో ఉద్యమంలో మమేకమై పనిచేశారు. మూడు సార్లు ఎమ్మెల్యేగా విజయాన్ని సాధించారు. మంత్రిగా, డిప్యూటీ స్పీకర్‌గా పనిచేశారు. ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల్లో పోటీలో ఉన్నారు.
పజ్జన్న అంటే ప్రజల మనిషి.. నిత్యం ప్రజల్లోనే ఉంటారు. ప్రతి ఒక్కరికీ అందుబాటులో ఉండే నాయకుడిగా పద్మారావుగౌడ్‌కు పేరు. కరోనా సమయంలో ప్రజలకు దగ్గరుండి ధైర్యం చెప్పారు. బాధితులకు పౌష్టికాహారాన్ని అందజేశారు. ఆక్సిజన్ సిలిండర్లను అందజేశారు. పండుగలు, శుభకార్యాలు చేసుకునే నిరుపేదలకు అండగా ఉండి సాయం చేస్తారు. వృద్ధులకు చేయూతనిస్తున్నారు. ప్రజల మధ్య ఉంటూ సమస్యలు తెలుసుకొని పరిష్కరిస్తున్నారు.
కోట్లాది రూపాయలతో అభివృద్ధి..
ముఖ్యమంత్రి కేసీఆర్‌తో ఉన్న సాన్నిహిత్యం వల్ల నియోజకవర్గానికి కోట్లాది రూపాయల నిధులు తీసుకువచ్చారు. అనేక అభివృద్ధి పనులు పూర్తి చేశారు. ప్రభుత్వం తీసుకువచ్చిన సంక్షేమ పథకాలను ఇంటింటికీ చేరవేస్తున్నారు. షాదీముబారక్, కల్యాణలక్ష్మి, సీఎంఆర్ఎఫ్ వంటి చెక్కులను స్వయంగా లబ్ధిదారులకు అందజేస్తున్నారు. పేదలకు రెండు వేల డబుల్బెడ్రూం ఇండ్లను అందజేశారు. ఈసారి అత్యధిక మెజారిటీతో ప్రజలు పట్టం కడతారనే ధీమాతో ఉన్నారు.