హైదరాబాద్, ఆగస్టు15 (నమస్తే తెలంగాణ): తెలంగాణకు ఫ్లోరైడ్ ముప్పు ముంచుకొస్తున్నది. భూగర్భ జలాలను ఎడాపెడా తోడుతుండటమే ఇందుకు కారణమని తెలిసింది. సెంట్రల్ గ్రౌండ్‌వాటర్ బోర్డు వెల్లడించిన వార్షిక గ్రౌండ్ వాటర్ క్వాలిటీ రిపోర్టు 2024లో ఈ విషయం వెల్లడైంది. తాగునీరు, వ్యవసాయ ప్రయోజనాల కోసం ఉపయోగించే భూగర్భ జలాల నాణ్యతను పరిశీలించేందుకు, వాటిలోని విషతుల్య మూలకాల గాఢతల హెచ్చుతగ్గులను అంచనా వేసేందుకు సెంట్రల్ గ్రౌండ్ వాటర్ బోర్డ్ (సీజీడబ్ల్యూబీ) స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ (ఎస్‌వోఈ)ని అనుసరించి, ప్రామాణిక పద్ధతిలో దేశవ్యాప్తంగా భూగర్భజల నాణ్యత పరీక్షలను ప్రతి సంవత్సరం నిర్వహిస్తుంది. అందుకు అనుగుణంగా రుతుపవనాలకు ముందు, రుతుపవనాల తరువాత భూగర్భజల నమూనాలను సేకరిస్తుంది.
నీళ్లలో ఫ్లోరైడ్, నైట్రేట్, ఐరన్, యురేనియం, సోడియం, ఆర్సెనిక్ తదితర భౌతిక రసాయన పారామితులు నియమిత గాఢతలో ఉన్నాయా? లేదా? అనేది విశ్లేషిస్తుంది. వాటన్నింటినీ క్రోడీకరించి వార్షిక నీటి నాణ్యతా నివేదికను విడుదల చేస్తుంది. అందులో భాగంగా మే 2023లో 15,259 పర్యవేక్షణ కేంద్రాల నుంచి భూగర్భ జల నమూనాలను సీజీడబ్ల్యూడీ సేకరించింది. భూగర్భజల నాణ్యతపై రుతుపవనాల ప్రభావాన్ని అంచనా వేసేందుకు దాదాపు 4,982 నమూనాలను సేకరించింది. అందుకు సంబంధించిన డాటాను వాటర్ క్వాలిటీ రిపోర్టు 2024 పేరిట ఇటీవల విడుదల చే సింది. దాని ప్రకారం దేశవ్యాప్తంగా భూగర్భ జలాల్లో నైట్రేట్, ఫ్లోరైడ్, ఆర్సెనిక్, ఇనుము పరిమితికి పెంచి పెరిగిపోయాయని తెలిపింది. దాదాపు 20 శాతం నమూనాల్లో నైట్రేట్ పరిమితికి మించిపోయిందని, 9.04 శాతం నమూనాల్లో పరిమితికి మించి ఫ్లోరైడ్, 3.55 శాతం నమూనాల్లో ఆర్సెనిక్ పరిమితికి మించి పెరిగిపోయాయని నివేదిక పేర్కొంది.
28 జిల్లాల్లో ఫ్లోరైడ్
తెలంగాణ వ్యాప్తంగా భూగర్భ జలాల్లో ఫ్లోరైడ్ సాంద్రత పెరిగిపోయిందని వార్షిక భూ గర్భ జలాల నివేదిక వెల్లడించింది. భూగర్భ జలాలను విపరీతంగా తోడేయడం అందుకు కారణమని పేర్కొన్నది. భూగర్భ జలాల్లో ఫ్లోరైడ్ గాఢత 15ఎంజీ/ఎల్ (మిల్లీగ్రామ్ పర్ లీటర్) మించరాదు. రాష్ట్రవ్యాప్తంగా 28 జిల్లాల్లో సాధారణ పరిమితికి మించి ఫ్లోరైడ్ గాఢత ఎకువగా ఉన్నట్టు తెలిపింది. బోరు బావుల అధిక వినియోగం కూడా ఒక కారణమని నివేదించింది.
32 జిల్లాల్లో నైట్రేట్
భూగర్భ జలాల్లో నైట్రేట్ పెరగడమనేది పర్యావరణ, ప్రజారోగ్యానికి ఒక ముఖ్యమైన సమస్యగా మారనుంది. వ్యవసాయ ప్రాంతాల్లో నత్రజని ఆధారిత ఎరువులు, జంతు వ్యర్థాల వినియో గం పెరగడం ఫలితంగా నైట్రేట్ గాఢత పెరుగుతున్నదని నివేదిక తెలిపింది. సాధారణంగా నీటిలో 45ఎంజీ/ఎల్ ఉండాలి. ఇది ప్రపంచ ఆరోగ్య సంస్థ, బీఐఎస్ సిఫార్సు చేసిన పరిమితి. కానీ దేశవ్యాప్తంగా సేకరించిన నమూనాల్లో దాదాపు 19.8 శాతం నమూనాల్లో ఆ పరిమితి మించిపోయింది. మరీ ముఖ్యంగా రాజస్థాన్, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల భూగర్భ జలాల్లో నైట్రేట్ కాలుష్యం తీవ్రంగా ఉందని, 40శాతం కంటే ఎకువ నీటి నమూనాలు నైట్రేట్ పరిమితిని మించిపోయాయని వెల్లడించింది. అందులో మహారాష్ట్ర (35.74 శాతం), తెలంగాణ (27.48 శాతం), ఆంధ్రప్రదేశ్ (23.5 శాతం), మధ్యప్రదేశ్ (22.58 శాతం) కూడా గణనీయమైన స్థాయిలో నైట్రేట్ కాలుష్యాన్ని చూపించడం గమనార్హం. ఇది తీవ్ర ఆందోళనకరమని నివేదిక తెలిపింది. తెలంగాణలోని 33 జిల్లాలకు గాను 32జిల్లాల్లో నైట్రేట్ గాఢత సాధారణం కంటే ఎక్కువగా ఉందని నివేదిక వెల్లడించింది.