తిమ్మాపూర్, జనవరి 12: కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం మన్నెంపల్లి డీ4 కెనాల్‌కు మళ్లీ గండిపడింది. ఆదివారం తెల్లవారుజామున తెగిపోవడంతో గ్రామంలోని దళిత కాలనీ జల దిగ్బంధంలో చిక్కుకున్నది. గతంలోనే నాలుగుసార్లు గండిపడినా అధికారులు తూతూ మంత్రంగా మరమ్మతులు చేసి చేతులు దులుపుకొన్నారు. సమస్య పునరావృతం కావడంపై ప్రజలు మండిపడుతున్నారు. సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలం తోటపల్లి రిజర్వాయర్ నుంచి వచ్చే ప్రధాన కాలువ కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం పీచుపల్లి మీదుగా సైదాపూర్ వెళ్తుంది.
పీచుపల్లి వద్ద డీ4 కాలువ విడిపోయి తిమ్మాపూర్, మానకొండూర్ మండలాల్లోని పలు గ్రామాలకు సాగునీటిని అందిస్తున్నది. మన్నెంపల్లి మీదుగా చెంజర్ల తదితర గ్రామాల మీదుగా వెళ్లే ఈ కెనాల్, గ్రామంలోని దళిత కాలనీ పైన కాలువ కట్ట పరిమాణం తక్కువ మోతాదులో ఉండటం, ఎత్తుగా ఉండటంతో నీళ్లు మర్లపడుతున్నాయి. దీనికితోడు కాలువలో చెత్తాచెదారం తొలగించకపోవడంతో నీరు వెళ్లలేక తరచూ గండిపడుతున్నది. ఇప్పటికే నాలుగుసార్లు తెగిపోగా, ఆదివారం తెల్లవారుజామున మరోసారి గండిపడటంతో మన్నెంపల్లి ఎస్సీ కాలనీ జలమయమైంది. వీధులన్నీ నీటితో నిండిపోయాయి.
కాలువ గండి పడిన సమీపంలో గుట్ట ఉండగా, దాని వరద నీళ్లు బయటకు వెళ్లేందుకు కెనాల్ కింద నుంచి డీబీ ఏర్పాటు చేశారు. గండి నుంచి బయటికి వస్తున్న నీరు ఆ డీబీ గుండా గ్రామంలోకి చేరుతున్నట్టు స్థానికులు చెప్తున్నారు. మన్నెంపల్లి వాసులకు సహాయక చర్యలు చేపట్టాలని కేంద్ర మంత్రి బండి సంజయ్ కలెక్టర్ పమేలా సత్పతిని ఆదేశించారు. ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ గ్రామాన్ని సందర్శించి బాధితులతో మాట్లాడారు. తరుచూ కాల్వకు గండి పడుతుందని, దీనికి శాశ్వత పరిష్కారం చూపాలని స్థానికులు కోరగా.. మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డితో మాట్లాడి శాశ్వత పరిష్కారం చూపుతానని హామీ ఇచ్చారు.
తోటపల్లి రిజర్వాయర్ నుంచి మెయిన్ కె నాల్ ద్వారా తిమ్మాపూర్, మానకొండూర్, చి గురుమామిడి, సైదాపూర్ మండలాల్లోని పలు గ్రామాలకు నీళ్లు వెళ్తాయి. ఈ క్రమంలో ప్రధా న కాలువ నుంచి చిగురుమామిడి మండలం పీచుపల్లి వద్ద డీ4 ఉప కాలువ ద్వారా తిమ్మాపూర్, మానకొండూర్ మండలాలకు వెళ్తాయి. మన్నెంపల్లి వరకు నీళ్లు సక్రమంగా వస్తున్నా, దిగువకు వెళ్లేందుకు నీళ్లు ఎక్కడం లేదు. దీంతో దిగువన ఉన్న రైతులు తమకు నీళ్లు ఎక్కువగా రావాలని 200 క్యూసెక్కుల కెపాసిటీ గల కాలువకు ప్రధాన కాలువ గుండా వెళ్లే నీరంతా ఇటు మళ్లించడంతో కెపాసిటీ సరిపోక గండి పడుతున్నట్టు అధికారులు పేర్కొంటున్నారు. గండికి తాత్కాలిక మరమ్మతులు చేపట్టి దిగువన ఉన్న రైతులకు నీటిని అందిస్తామని ఇరిగేషన్ ఎస్ఈ పెద్ది రమేశ్ తెలిపారు.
కాలువ గండి పడటానికి మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి నైతిక బాధ్యత వహించాలని మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ డిమాండ్ చేశారు. పండుగ పూట సంతోషంగా ఉండాల్సిన కుటుంబాలు పస్తులుండాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. పొంగులేటి సొంత కంపెనీ రాఘవ కన్స్ట్రక్షన్స్ ద్వారానే కాలువ నిర్మాణం జరిగిందని గుర్తుచేశారు. బాధితులను ప్రభుత్వం ఆదుకోవాలని, ఎమ్మెల్యే కవ్వంపల్లి చుట్టపు చూపుగా రావడం భావ్యంకాదని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు గురించి మాట్లాడే పొంగులేటికి, తన సొంత సంస్థ చేసిన నిర్మాణానికి బాధ్యత ఉండదా? అని ప్రశ్నించారు.
నీళ్లన్నీ ఇండ్లల్లోకి చేరడంతో కాలనీ వాసులు అవస్థలు పడుతున్నారు. నిత్యావసర వస్తువులు తడిసిపోగా, బాధితులు కన్నీటి పర్యంతమయ్యారు. పండుగ పూట సంతోషంగా గడపాల్సిన గ్రామస్థులు తిండిలేక ఇబ్బందులు పడుతున్నారు. చిన్న పిల్లలు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. నాలుగోసారి తెగడం, అధికారులు ఎప్పటిలాగే సరిచేస్తం అని చెప్పడంతో గ్రామస్థులు మండిపడుతున్నారు.
ఇప్పటికి నాలుగు సార్ల మా దగ్గర్నే తెగింది. తెగినప్పుడల్లా రెండు రోజులు ఇళ్లంతా నీళ్లే ఉంటన్నయి. తెగినప్పుడు కూడా జాలు పడ్తది. కాలువకు నీళ్లత్తన్నయంటే భయం భయంగా గడుపుడైతంది. ఇంట్ల సమాన్లన్నీ తడిసిపోయినయ్. పండుగకు తెచ్చుకున్న సమాన్లు కరాబైనయ్. తెగినప్పుడు సార్లు అత్తరు, అట్లీట్ల అంటరు పోతరు. మల్ల కనిపియ్యరు. పగటీలైంది ఇవ్వారకు అన్నం తిండ్లే. పోరగండ్లను పట్టుకుని గడుపుతన్నం.
-పార్నంది సుమలత, మన్నెంపల్లి
ఆదివారం తెల్లవారే సరికి వరద వచ్చి ఇంటిని ముంచేసింది. ఎన్నిసార్లు జరిగినా అప్పటిమందం సమస్య పరిష్కరించి వదిలేస్తున్నరు. పొద్దు పొద్దున్నే నీళ్లు రావడంతో ఇంట్ల సామాన్లన్నీ తడిచిపోయినయ్. తీవ్ర ఇబ్బందులు పడుతున్నం. ప్రభుత్వం స్పందించి మాకు మరోసారి సమస్య రాకుండా చూడాలి.
– సుదగోని సదయ్యగౌడ్, మన్నెంపల్లి
కాలువకు గండి పడడంతో ప్రజలు పండుగ పూట ఇబ్బంది పడుతున్నరు. సామాన్లు కూడా తడిసిపోయినయ్. అధికారులకు ఎన్నిసార్లు వివరించినా తాత్కాలికంగా పరిష్కరిస్తున్నరు. కాలువ తెగినప్పుడల్లా 40 50 కు టుంబాలు ఇబ్బంది పడాల్సి వస్తున్నది. మరోసారి ఇట్ల జరగకుండా చూడాలి.
– మేడి అంజయ్య, మాజీ సర్పంచ్, మన్నెంపల్లి