మహదేవపూర్/కాళేశ్వరం/కన్నాయిగూడెం, జూలై 10: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం అంబట్పల్లి గ్రామంలోని లక్ష్మీ (మేడిగడ్డ) బరాజ్‌కు వరద ప్రవాహం పెరుగుతున్నది. 16.17 టీఎంసీ నిల్వ సామర్థ్యం కలిగిన బరాజ్‌కు మంగళవారం ఇన్‌ఫ్లో 35,200 క్యూసెక్కులు రాగా, బుధవారం 41,500 క్యూసెక్కులకు పెరిగింది. బరాజ్‌లో మొత్తం 85 గేట్లు ఎత్తి అంతే మొత్తంలో వరదను దిగువకు వదులుతున్నారు. రివర్ బెడ్ లెవల్ సముద్ర మట్టానికి 88 మీటర్లు కాగా.. ప్రస్తుతం ప్రవాహం 89.90 మీటర్ల ఎత్తులో కొనసాగుతున్నది.
అంటే.. 1.90 మీటర్ల ఎత్తులో ప్రవహిస్తున్నది. ప్రాణహిత జలాల రాకతో కాళేశ్వరం వద్ద గోదావరి ప్రవాహం పెరుగుతున్నది. బుధవారం సాయిత్రం వరకు కాళేశ్వరం పుష్కరఘాట్ వద్ద 45 వేల క్యూసెక్కులతో 5.05 మీటర్ల ఎత్తులో ప్రవహిస్తున్నది. ములుగు జిల్లా తుపాకులగూడెం సమ్మక్క బరాజ్ వద్ద గోదావరి నీటిమట్టం క్రమంగా పెరుగుతున్నది. బరాజ్ వద్ద 64,350 క్యూసెక్కుల ప్రవాహం కొనసాగుతున్నట్టు నీటిపారుదల శాఖ అధికారులు తెలిపారు. ఎగువ నుంచి వస్తున్న వరదను 52 గేట్లను ఎత్తి దిగువకు వదులుతున్నారు. ప్రస్తుతం బరాజ్ వద్ద గోదావరి నీటిమట్టం 73.40 మీటర్ల ఎత్తుకు చేరింది.