హైదరాబాద్, ఆగస్టు 28 (నమస్తే తెలంగాణ నెట్వర్క్) : మిన్ను విరిగి మీద పడ్డట్టుగా కురిసిన జోరువానతో.. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో జనజీవనం అస్తవ్యస్తమైంది. కుండపోత కుమ్మరిచ్చినట్టు గురిసిన వాన తో ఊరూ ఏరూ ఏకమయ్యాయి. చెరువు లు, వాగులు, వంకలు పొంగిపొర్లాయి. లోతట్టు ప్రాంతాలను ముంచాయి. రోడ్లు ఎక్కడికక్కడ దెబ్బతిన్నాయి. గ్రామాల మ ధ్య అనుసంధానం లేకపోవడంతో రాకపోకలు స్తంభించాయి. వరద ఉధృతిలో ఊర్లు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. కామారెడ్డి జిల్లాలో జాతీయ రహదారి-44 తెగిపోవడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఆదిలాబాద్ జిల్లాలోని భోరజ్ వద్ద వాహనాలను నిలిపివేశారు. మహారాష్ట్ర నుంచి హైదరాబాద్‌కు వాహనాలను నిలిపివేయడంతో కిలోమీటర్ల మేర వాహనాలు ఆగిపోయాయి. గురువారం 10 గంటల తర్వాత వాహనాలను అనుమతించారు. నిర్మల్- ఆదిలాబాద్‌కు పాత జాతీయ రహదారి కోతకు గురైంది. నిర్మల్ శివారులోని సిద్ధాపూర్ వాగు, మథోల్ మండలంలోని వడ్తాల్ వాగు ఉప్పొంగి ప్రవహిసుండగా పలు గ్రామాలకు నిలిచిపోయాయి. కల్లూర్ నుంచి అందకూర్ నడుమ ప్రధాన రహదారి కోతకు గురైంది.
ములుగు జిల్లా తాడ్వాయి, గోవిందరావుపేట మండలాల్లో అత్యధిక వర్షం కురిసి జిల్లెలవాగు పొంగడంతో పస్రా-తాడ్వాయి మధ్య 163 జాతీయ రహదారి కోతకు గురైంది. మెదక్-శమ్నాపూర్ వద్ద రైల్వే ట్రాక్ కుంగిపోయింది. సిద్దిపేట కొత్త బస్టాండ్ నుంచి మోడ్రన్ బస్టాండ్ మధ్యలో రోడ్ వెంబడి బ్రిడ్జి పైన నీరు చేరింది. వరద ఉధృతి తగ్గేవరకు రాకపోకలు నిలిపివేశారు. కూడవెల్లి వాగు ఉధృతంగా ప్రవహిస్తున్నది. ఉమ్మడి ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం కిష్టారం వద్ద రోడ్డుపైకి వర్షపునీరు పొంగి ప్రవహిస్తున్నది. అన్నారుపాడు- గుండ్లరేవు మధ్య తుమ్మలవాగు, బేతాళపాడు-పడమట నర్సాపురం మధ్య పెద్దవాగు, రాళ్లవాగు పొంగిపొర్లుతున్నాయి. ఆయా మార్గాల్లో రాకపోకలు నిలిపివేశారు. నందిపాడు-ఆసుపాక మధ్య ప్రధాన రహదారిపై భారీ వృక్షం కూలడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.
రాష్ట్రంలో భారీ వర్షాలు, వరదల కారణంగా 362చోట్ల సాగునీటి ప్రాజెక్టులు, చెరువులు, కాల్వలకు నష్టం వాటిల్లిందని నీటిపారుదలశాఖ అధికారులు తెలిపారు. ఈ సీజన్లో గురువారం నాటికి 117 చెరువులకు గండ్లు పడ్డాయి. మరో 117చెరువుల కట్టలు, తూములు దెబ్బతిన్నాయి. ప్రాజెక్టుల కాల్వలకు 88చోట్ల గండ్లుపడగా, 40చోట్ల దెబ్బతిన్నాయి. శాశ్వత మరమ్మతులకు 62.56కోట్లు అవసరమని అధికారులు అంచనా వేశారు. ఆర్అండ్బీ పరిధిలోని 37డివిజన్లలో 1039 కిలోమీటర్ల మేర రోడ్లకు తీవ్ర నష్టం జరిగిందని ఆ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వికాస్‌రాజ్ వెల్లడించారు. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గురువారం రోడ్ల పరిస్థితిపై టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు.