హైదరాబాద్ సిటీబ్యూరో, సెప్టెంబర్ 27(నమస్తే తెలంగాణ): శుక్రవారం రాత్రి 8 గంటల సమయంలో మూసీ పరీవాహక ప్రాంతాలైన చాదర్‌ఘాట్, మూసారాంబాగ్లు పోటెత్తిన వరద ప్రవాహంతో ఉలిక్కిపడ్డాయి. అకస్మాత్తుగా వచ్చి చుట్టేసిన వరద తాకిడికి ఇండ్లలోంచి బయటకు రాలేక జనం తల్లడిల్లిపోయారు. వరద ముంచెత్తే అవకాశం ఉందని ముందస్తు హెచ్చరికలు లేకపోవడంతో జనం ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ గడిపారు. జంట జలాశయాలైన హిమాయత్‌సాగర్, ఉస్మాన్‌సాగర్ నుంచి నీటిని ఒక్కసారిగా వదలడంతోనే ఈ పరిస్థితి తలెత్తింది. జలాశయాల నుంచి నీటిని విడదల చేయడానికి ముందు గతంలో అధికారులు వచ్చి హెచ్చరించే వారని, ఇప్పుడు మాత్రం ఎలాంటి సమాచారం లేకుండా చేయడం వల్లే ఇండ్లు నీట మునిగాయని చాదర్‌ఘాట్, మూసారాంబాగ్ ప్రాంతాల్లోని మూసానగర్, శంకర్‌నగర్, దుర్గానగర్, వినాయకవీధి, అంబేద్కర్‌నగర్ బస్తీ వాసులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.
పాతబస్తీలోని జియాగూడ, పురానాపూల్, గోల్కా ప్రాంతా లు నీట మునిగాయి. జలాశయాలకు వరద పోటెత్తడంతోనే నీటిని విడుదల చేశామని అధికారులు చెప్తున్నా ముందస్తు హెచ్చరికలు చే యకపోవడం అనుమానాలకు తావిస్తున్నది. గతంలో మూసీ వరద సమయంలో ముంద స్తు హెచ్చరికలు జారీ చేయడంతో పాటు రెవెన్యూ యంత్రాంగం మొత్తం తరలివచ్చేది. డీపీఆర్వో ద్వారా ముందస్తు ప్రకటనలు ఇచ్చేవారు. కలెక్టర్ ఆదేశాల మేరకు ఆర్డీవో, ఎమ్మార్వోలు క్షేత్రస్థాయికి వచ్చి ప్రజలను అప్రమ త్తం చేయడంతో పాటు సురక్షిత ప్రాంతాలకు ముందస్తుగా తరలించేవారు. కానీ ఈసారి అలాంటిదేమీ లేకుండా పోయింది.