ఖమ్మం: ఖమ్మం జిల్లాలోని (Khammam) మున్నేరు వంతెన వద్ద వరద బాధితులు ఆందోళనకు దిగారు. రెండు రోజులుగా వరదల్లో ఉన్నా, తమను ఎవరూ పట్టించుకోవడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. భోజనం లేదని, కనీసం తాగేందుకు కూడా నీళ్లు కూడా అందించట్లేదని మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. కరుణగిరి వద్ద సాయి కృష్ణ నగర్ వాసులు ఆందోళనకు దిగారు. ఆదుకోవాలని కోరుతుంటే పోలీసులు జులుం చేస్తున్నారన్నారు. ఎన్నడూ ఇలాంటి పరిస్థితి రాలేదని చెప్పారు. బీఆర్ఎస్ హయాంలో ముందస్తు హెచ్చరికలు చేసేవారని వెల్లడించారు. కేసీఆర్ సర్కార్ ఉన్నప్పుడే బాగుండేదని చెప్పారు. పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి అన్ని సౌకర్యాలు కల్పించేవారని వెల్లడించారు. మళ్లీ కేసీఆర్ మాకు కావాలన్నారు.
సర్కారు వైఫల్యంపై రోడ్డెక్కిన వరద బాధితులు
‘సీఎం డౌన్‌డౌన్.. రేవంత్‌రెడ్డి వెంటనే రాజీనామా చేయాలి.. ఖమ్మం జిల్లాకు చెందిన ముగ్గురు మంత్రులు వెంటనే వారి పదవులకు రాజీనామాలు చేయాలి.. తుమ్మల నాగేశ్వరరావు ఎక్కడున్నా వెంటనే ఇక్కడికి రావాలి.. పొంగులేటీ.. అన్నా-అక్కా అంటూ తిరగావు కదా ఇప్పుడు ఎక్కడున్నవ్? వెంటనే ఇక్కడికి రావాలి’ అంటూ ఖమ్మం నగర ప్రజలు ఆందోళన చేపట్టారు. ఆదివారం ఖమ్మం నగరంలోని కాల్వొడ్డు, ప్రకాశ్‌నగర్ వద్ద స్థానికులు, వరద బాధితులు పెద్దసంఖ్యంలో రోడ్డు మీదకు వచ్చి ధర్నా చేశారు. ఈ సందర్భంగా పలువురు యువకులు మాట్లాడారు. జిల్లాలో ముగ్గురు మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, భట్టి విక్రమార్క ఉన్నా పనికిరారని ఆగ్రహం వ్యక్తంచేశారు.
రెండ్రోజుల నుంచి భారీ వర్షాలు కురిసి వరదలు వచ్చి ఇండ్లు కొట్టుకపోతున్నా ఏ ఒక్క మంత్రి కూడా ఇక్కడికి రాలేదని, వారు వెంటనే పదవులకు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. జిల్లా కలెక్టర్ డౌన్‌డౌన్.. ఎమ్మార్వో డౌన్‌డౌన్.. అంటూ నినాదాలు చేశారు. ఆందోళనకారులను సముదాయించడానికి ప్రయత్నం చేసిన పోలీసులపైనా ఆందోళనకారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ఏడాది ఇదేవిధంగా వరదలు వచ్చి ఇబ్బందుల్లో ఉంటే పువ్వాడ అజయ్ గిర్రుగిర్రున తిరుగుతూ వరద నీటిలోనే ప్రజలను ఆదుకున్నారని పలువురు మహిళలు గుర్తుచేసుకున్నారు. అలాంటోడిని వదిలి ఈ కాంగ్రెస్సోడికి ఓటేస్తే ఎవడూ రాలేదేం? అని ధ్వజమెత్తారు.
‘తుమ్మల గోబ్యాక్’ అంటూ నినాదాలు
వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు చేదు అనుభవం ఎదురైంది. ఆదివారం రాత్రి వరద బాధితులను పరామర్శించేందుకు ఖమ్మం నగరంలోని ప్రకాశ్‌నగర్‌కు వెళ్లగా.. అక్కడ ఉన్న బాధితులు తుమ్మలను చూసి ఇప్పుడా వచ్చేది తుమ్మల గారు, గోబ్యాక్ మంత్రి తుమ్మల అంటూ నినాదాలు చేస్తూ ధర్నా చేశారు. వరదల్లో చిక్కుకొని ఆర్తనాదాలు చేస్తుంటే జిల్లాకు చెందిన ముగ్గురు మంత్రులు ఉండి ఏం చేస్తున్నారు? అని నిలదీశారు. తక్షణమే తమవారిని కాపాడేందుకు హెలికాఫ్టర్ కావాలని ఘెరావ్ చేశారు. అయితే, హెలికాప్టర్ వచ్చే పరిస్థితులు లేవని చావు కబురు చల్లగా చెప్పారు. దీంతో తనకున్న పలుకుబడితో ఏపీ సీఎం చంద్రబాబును సాయం కోరినట్టు చెప్పినా ఆదివారం రాత్రి వరకు విశాఖపట్నం నుంచి ఒక్క హెలికాఫ్టర్ కూడా రాలేదు. ఆఖరుకు కొందరు జర్నలిస్టులు ఇచ్చిన సమాచారంతో మున్నేరులో చిక్కుకున్న బాధితులను కాపాడేందుకు అగ్నిమాపక ఎస్డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగాయి.