నమస్తే తెలంగాణ నెట్వర్క్, అక్టోబర్ 9: ప్రాజెక్టులకు ఎగువ ప్రాంతాల నుంచి వరద కొనసాగుతున్నది. శనివారం జూరాల ప్రాజెక్టుకు 89 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తున్నది. ప్రాజెక్టు ఎనిమిది గేట్లు ఎత్తి 79,879 క్యూసెక్కులను దిగువకు విడుదల చేస్తున్నారు. తుంగభద్ర డ్యాంకు 38,702 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో, 38,758 క్యూసెక్కుల అవుట్‌ఫ్లో నమోదైంది. శ్రీశైలం ప్రాజెక్ట్‌కు వరద ప్రవాహం పెరిగింది. ఎగువ నుంచి 1,37,308 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వచ్చి చేరుతున్నది. 64,744 క్యూసెక్కుల అవుట్‌ఫ్లో నమోదైంది. శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు ఎగువ నుంచి 80,200 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తున్నది. ప్రాజెక్టు 11 వరద గేట్ల నుంచి 49,920 క్యూసెక్కుల నీటిని గోదావరిలోకి వదులుతున్నారు. ఎస్కేప్ గేట్ల నుంచి గోదావరిలోకి 1,500 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. సంగారెడ్డి జిల్లా సింగూరు ప్రాజెక్టుకు శనివారం మధ్యాహ్నం వరకు 30 వేల క్యూసెక్కుల వరద కొనసాగింది. ఆ తర్వాత వరద కాస్త తగ్గు ముఖం పట్టింది. కాగా 14,984 క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలారు. ప్రాజెక్టులో 28.555 టీఎంసీలు నీరు నిల్వ ఉన్నది.