బూర్గంపహాడ్ (భద్రాచలం)/ఏటూరునాగారం/మంగపేట/వాజేడు, సెప్టెంబర్ 10: ఎగువ నుంచి వస్తున్న వరదతో భద్రాచలం వద్ద గోదావరి పోటెత్తింది. మంగళవారం సాయం త్రం 5.15 గంటలకు ప్రవాహం 48 అడుగులకు చేరడంతో రెండో ప్రమాద హెచ్చరిక జారీచేశారు. రాత్రి 7 గంటలకు రెండో ప్రమాద హెచ్చరికను దాటి 48.50 అడుగుల వద్ద గోదావరి ఉరకలు వేస్తుండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఇటు పెరుగుతున్న గోదావరికి తోడు.. అటు శబరి వరద కూడా పోటెత్తింది. చింతూరు వద్ద శబరి నది పోటెత్తడంతో సారపాక, భద్రాచలం వద్ద ఆంధ్రా, ఛత్తీస్గఢ్, ఒడిశా రాష్ర్టాలకు వెళ్లే లారీలు, ఇతర వాహనాల రాకపోకలను పోలీసు అధికారులు నిలిపివేశారు.
ఏటూరునాగారం పుష్కరఘాట్ వద్ద..
ఎగువ నుంచి వస్తున్న వరదతో ములుగు జిల్లా ఏటూరునాగారం రామన్నగూడెం పుష్కరఘాట్ వద్ద ప్రవాహం రెండో ప్రమాద హెచ్చరిక స్థాయికి చేరువైంది. మంగళవారం సాయంత్రం 4 గంటలకు పుష్కరఘాట్ వద్ద 15.800 మీటర్లకు చేరుకున్నది. 15.830 మీటర్లకు చేరితే రెండో ప్రమాద హెచ్చరికను జారీ చేస్తారు.
కరీంనగర్-ముంబై మధ్య 4 ప్రత్యేక రైళ్లు
హైదరాబాద్, సెప్టెంబర్ 10(నమస్తే తెలంగాణ) : దీపావళి, ఛాట్ సందర్భంగా ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేసినట్టు రైల్వే అధికారులు తెలిపారు. కరీంనగర్-ముంబై మధ్య అక్టోబర్ 29 నుంచి నవంబర్ 6 వరకు ఈ రైళ్లు రాకపోకలు సాగిస్తాయన్నారు.
సవాళ్లను అధిగమించాలి
హైదరాబాద్, సెప్టెంబర్ 10 (నమస్తే తెలంగాణ) : కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన నూతన న్యాయచట్టాల అమలులో ఎదురయ్యే సవాళ్లను పోలీసులు, జైళ్లశాఖ సిబ్బంది అధిగమించాలని జైళ్లశాఖ డీజీ సౌమ్యామిశ్రా సూచించారు. మంగళవారం చంచల్గూడ జైలులో బీపీఆర్ అండ్ డీ, కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలో కొత్త న్యాయచట్టాలపై శిక్షణను ఆమె ప్రారంభించారు.