గార్ల, ఆగస్టు 29: మహబూబాబాద్ జిల్లా గార్ల మండలం మర్రిగూడెంలో 500 ఏండ్ల చరిత్ర, అత్యంత మహిమ గల శ్రీవేట వేంకటేశ్వరస్వామి ఆలయంపై ఎమ్మెల్యే కోరం కనకయ్య అనుచరులు పెత్తనం చెలాయిస్తున్నారు. ఈ నెల 24 నుంచి 28 వరకు జరగాల్సిన ఆలయ ధ్వజస్తంభం పునఃప్రతిష్ఠాపన వేడుకలను అడ్డుకున్నారు. దీంతో గ్రామస్థులందరూ ఎమ్మెల్యే కనకయ్య, ఆయన అనుచరులపై మండిపడుతున్నారు. మర్రిగూడెంలో ఉన్న శ్రీవేట వేంకటేశ్వరస్వామి ఆలయంలోని ధ్వజస్తంభం ఇటీవల వచ్చిన గాలి దుమారానికి కూలిపోయింది. మంచి ముహూర్తాలు లేక ఇన్ని రోజులుగా పునఃప్రతిష్ఠ జరగలేదు. ఇప్పుడు మంచి రోజులు ఉండటంతో వేద పండితులు ఈ నెల 24 నుంచి 28వ తేదీ వరకు ముహూర్తం నిర్ణయించారు. ఈ నెల 24 నుంచి ఆలయంలో ధ్వజస్తంభం వేడుకలు జరుగుతుండగా.. ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య అనుచరులు ఆలయం నిధులపై దుష్ప్రచారం చేస్తూ దేవాదాయ శాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు.
ధ్వజస్తంభం పునఃప్రతిష్ఠాపనకు ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్యకు ఆహ్వానం పంపలేదని ఆరోపిస్తూ.. ఈ నెల 28న జరగాల్సిన ఉత్సవాలను నిలిపివేశారు. దీంతో గతంలో ఆలయ అభివృద్ధికి రూ.కోటి 5 లక్షలు విరాళం అందించిన రాంపురం గ్రామానికి చెందిన అమెరికాలో స్థిర పడిన పులి గోపాల్‌రెడ్డి-పులి ప్రమీలారెడ్డి స్పందించారు. ధ్వజస్తంభం ప్రతిష్ఠాపనను నిలిపేయొద్దని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేదు. ఆలయ ఈవో నందన కవిత ధ్వజస్తంభం పునఃప్రతిష్ఠ వేడుక నిర్వహించొద్దని, ఆలయ ప్రాంగణంలో మీడియా సమావేశం ఏర్పాటు చేయొద్దని ఫోన్ చేసి బెదిరిస్తున్నట్టు ప్రమీలారెడ్డి ఆరోపించారు. ధ్వజస్తంభం వేడుక కోసం అమెరికా నుంచి వచ్చామని, ధ్వజస్తంభం పునఃప్రతిష్ఠ చేయాలని ఆమె కోరారు. ధ్వజస్తంభం పునఃప్రతిష్ఠాపన చేయకపోతే దసరా పండుగకకు జరిగే బ్రహ్మోత్సవాలు కూడా నిలిపేయాల్సి ఉంటుందని ఆలయ ప్రధాన అర్చకులు చెప్తున్నారు.