భూదాన్‌పోచంపల్లి, డిసెంబర్ 7: స్నేహితుల సరదా ప్రాణాలనే బలి తీసుకున్నది. కారులో బయలుదేరిన వారి ప్రయాణం విషాదాంతంగా ముగిసింది. యాదాద్రి జిల్లా జలాల్పూర్ వద్ద జరిగిన ఘోర దుర్ఘటనలో ఐదుగురు యువకులు మృతిచెందగా, మరొకరు ప్రాణాలతో బయటపడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్ ఎల్బీ నగర్‌లోని సిరినగర్ కాలనీకి చెందిన వంశీగౌడ్ (23), విగ్నేశ్ (21), ర్యాపిడో డ్రైవర్ హ ర్షవర్ధన్ (21), బల్లూ (19), వినయ్ (20), మణికాంత్ కలిసి శుక్రవారం అర్ధరాత్రి కారు లో సరదాగా బయలుదేరారు.
ఈత కల్లు కోసం శనివారం తెల్లవారుజామున నాలుగు గంటలకు భూదాన్‌పోచంపల్లికి చేరుకున్నారు. టిఫిన్ కోసం రంగారెడ్డి జిల్లా పరిధిలోని కొత్తగూడేనికి వెళ్లారు. తిరిగి పోచంపల్లికి వెళ్తుండగా మార్గమధ్యంలో జలాల్పూర్ చెరువు కట్టపై కారు అదుపు తప్పి చెరువులోకి దూసుకెళ్లింది. ప్రమాదంలో ఐదుగురు యువకులు జలసమాధి అయ్యారు. మణికాంత్ మాత్రం కారు అద్దాలు ధ్వంసం చేసి బయటపడ్డాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని క్రేన్ సాయంతో కారును బయటికి తీశారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం భువనగిరి ఏరియా దవాఖానకు తరలించారు. చౌటుప్పల్ ఏసీపీ మధుసూదన్‌రెడ్డి, ఎస్సై భాసర్‌రెడ్డి విచారణ చేపట్టారు.