China Manja | అల్లాపూర్, జనవరి 26: నిషేధిత చైనా మాంజా మరో ప్రాణం తీసింది. చైనా మాంజా మెడకు చుట్టుకొని ఐదేండ్ల బాలిక హైదరాబాద్‌లోని కూకట్పల్లి పోలీస్‌స్టేషన్‌లో పరిధిలో దుర్మరణం చెందింది. తన సోదరితో కలిసి తండ్రి మోటర్‌సైకిల్‌పై ప్రయాణిస్తుండగా ఈ దుర్ఘటన చోటుచేసుకున్నట్టు పోలీసులు తెలిపారు. ఎగురుతున్న పతంగికి చెందిన మాంజా బాలిక మెడకు చుట్టుకొని లోతుగా తెగిందని, దీంతో తీవ్ర రక్తస్రావం జరిగి ఐదేండ్ల నిశ్విక ఆదిత్య మరణించిందని పేర్కొన్నారు. తండ్రి మోటర్‌సైకిల్ నడుపుతుండగా.. నిశ్విక ముందు కూర్చున్నదని తెలిపారు. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలోని ఖాజిపల్లి నుంచి తిరిగి వస్తుండగా వివేకానందనగర్ వద్ద దుర్ఘటన జరిగిందని చెప్పారు. బాధితులు కేపీహెచ్‌బీలోని గోపాల్‌నగర్‌కు చెందిన వారని, ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు పేర్కొన్నారు.
డజను మందికిపైగా గాయాలు
చైనా మాంజా కారణంగా తెలంగాణలో రెండు వారాల వ్యవధిలో జరిగిన రెండో దుర్ఘటన ఇది. ఈ నెల 14న సంగారెడ్డి జిల్లాలో ఇదేవిధంగా 35 ఏండ్ల వ్యక్తి చైనా మాంజా కారణంగా దుర్మరణం చెందారు. ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన అవిదేశ్ మోటర్‌సైకిల్‌పై వెళ్తుండగా అతని మెడకు చైనా మాంజా చుట్టుకొని తీవ్రగాయమైంది. మాంజా గొంతును కోసేయడంతో అతడు అక్కడికక్కడే మరణించాడు. ఈ నెలలో హైదరాబాద్ పరిధిలోనే డజను మందికిపైగా చైనా మాంజా కారణంగా గాయాలపాలయ్యారు. గాయపడినవారిలో ఓ అసిస్టెంట్ సబ్ఇన్స్పెక్టర్, 70 ఏండ్ల వృద్ధురాలు కూడా ఉన్నారు. రెండేండ్ల క్రితం 2024లో హైదరాబాద్‌లోనే నాయక్ ర్యాంక్ సైన్యాధికారి కూడా ఇదేరీతిలో చైనామాంజా కారణంగా గొంతు తెగి దుర్మరణం పాలయ్యాడు. నిషేధం విధించినప్పటికీ ఈ సంక్రాంతి సందర్భంగా పతంగులు ఎగురవేయడానికి హైదరాబాద్, పరిసర ప్రాంతాల్లో చైనా మాంజాను విరివిగా ఉపయోగించినట్టు తెలుస్తున్నది. చైనా మాంజాను అరికట్టేందుకు పోలీసులు ఈ నెల 8 నుంచి 11 మధ్య స్పెషల్ డ్రైవ్ నిర్వహించి రూ.43 లక్షల విలువైన మాంజాను సీజ్ చేశారు. నిషేధిత మాంజాను విక్రయిస్తున్న 57 మందిని అరెస్టు చేసి కేసులు పెట్టారు. మొత్తంగా గత నెల రోజుల వ్యవధిలో రూ.1.68 కోట్ల విలువైన చైనా మాంజాను సీజ్ చేసి 200 మందిని అరెస్టు చేసినట్టు పోలీసులు చెప్పారు.