మంచిర్యాల, జూలై 26 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే పేద పిల్లలకు సాయం చేయడం తప్పా? విద్యార్థులకు ఉపయోగపడే వస్తువులు విరాళం ఇస్తే నేరమా? ప్రభుత్వ బడులకు ఎవ్వరూ ఏమీ ఇవ్వకూడదని ఏదైనా నిబంధన ఉందా? అలా చేయడం నిషిద్ధమా? ఇవ్వకూడదని ప్రభుత్వం ఏమైనా చట్టం చేసిందా? సర్కార్ స్కూళ్లకు స్వచ్ఛందంగా ఏమైనా విరాళం ఇవ్వవచ్చు.. కానీ మంచిర్యాల జిల్లాలో మాత్రం ఇలా చేయడం పెద్ద నేరం.
గిఫ్ట్ ఏ స్మైల్ కింద విరాళంగా ఇచ్చిన కుర్చీలు తీసుకున్నారని చెన్నూర్ మున్సిపాలిటీ పరిధిలోని నల్లగొండ పోచమ్మవాడ స్కూల్ వైస్ ప్రిన్సిపాల్ ను సస్పెండ్ చేశారు. విధుల్లో ఉన్న మరో ఐదుగురు ఉపాధ్యాయులు సహా కాంట్రాక్ట్ పీఈటీతో పాటు వృత్తి శిక్షణ ఇచ్చే ఇన్‌స్ట్రక్టర్‌కు సైతం షోకాజ్ నోటీసులు ఇచ్చారు. ఇది ఎక్కడి సంస్కృతి.. విరాళం ఇచ్చిన కుర్చీలు తీసుకున్నందుకు బడి మొత్తానికి శిక్ష వేయడం ఏంటి. అంత సీరియస్ యాక్షన్ తీసుకునే పెద్ద తప్పు వాళ్లు ఏం చేశారు.. అన్న సందేహాలు తలెత్తుతున్నాయి. ఈ విషయంలో ఉన్నతాధికారులు వ్యవహరించిన తీరుపై ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘాలు భగ్గుమంటున్నాయి.
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పుట్టినరోజు సందర్భంగా గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమంలో భాగంగా స్థానిక బీఆర్ఎస్ నాయకులు నల్లగొండ పోచమ్మవాడ స్కూల్‌కు 30 కుర్చీలను విరాళంగా అందజేశారు. ఈ మేరకు ప్రధానోపాధ్యాయుడు (ఇన్చార్జి భీమారం మండల ఎంఈవో)ను అనుమతి కోరగా స్కూల్లో వద్దు బయట చేసుకోండని చెప్పినట్టు తెలిసింది. అనుమతి ఇచ్చిన హెచ్ఎం తాను ఇన్చార్జి ఎంఈవోగా ఉన్న భీమారం మండలానికి వెళ్లడంతో, స్కూల్ బ్రేక్ టైమ్‌లో బయటికి వచ్చిన పదో తరగతి విద్యార్థులకు కుర్చీలు అందజేశామని బీఆర్ఎస్ నాయకులు పేర్కొన్నారు. ఆ సమయంలో ఉపాధ్యాయులు ఎవ్వరూ కార్యక్రమంలో పాల్గొనలేదని తెలిపారు. జరిగింది ఇదైతే.. ఆ సమయంలో స్కూల్లో ఉన్న వైస్ ప్రిన్సిపాల్ సహా ఇతర ఉపాధ్యాయులపై చర్యలు తీసుకోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పేద విద్యార్థులకు విరాళం ఇస్తే దాన్ని రాజకీయం చేయడంపై ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘాల నాయకులు మండిపడుతున్నారు. విరాళంగా ఇచ్చిన కుర్చీలు తీసుకున్నందుకు ఓ ఉపాధ్యాయుడిని సస్పెండ్ చేయడం, మిగిలిన వారందరికీ షోకాజ్ నోటీసులు ఇవ్వడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. ఈ చర్య ఉపాధ్యాయలోకాన్ని అవమానించడమేనని మండిపడుతున్నారు. రేపు ఇంకెవ్వరైనా పుట్టిన రోజుకో, జ్ఞాపకార్థమో స్కూళ్లకు బెంచీలు, విద్యార్థులకు పుస్తకాలు ఇస్తారు.. అది కూడా నేరం కిందకే వస్తుందా.. అప్పుడు ఉపాధ్యాయులను సస్పెండ్ చేస్తారా.. అనేదానిపై స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు.
విరాళం ఇచ్చిన కుర్చీలు తీసుకోవడం రాజకీయ పార్టీ కార్యక్రమం ఎలా అవుతుందో చెప్పాలని నిలదీశారు. బీఆర్ఎస్ నుంచి ఇచ్చినందుకే ఇంత రాద్ధాంతాం చేస్తున్నారా.. అలాగైతే గతం లో కాంగ్రెసోళ్లు ప్రతిపక్షంలో ఉండి ఇలాం టి విరాళాలు ఇవ్వలేదా? ఇందిరాగాంధీ, రాజీవ్‌గాంధీ జయంతి కార్యక్రమాలకు బడుల్లోకి పోలేదా అని నిలదీశారు. జిల్లా విద్యాశాఖ అధికారి యాదయ్యను వివరణ కోరగా.. పాఠశాలలో పొలిటికల్ పార్టీ మీటింగ్‌కు అనుమతి ఇచ్చినందుకు బాధ్యులపై చర్యలు తీసుకున్నామని చెప్పారు.