తిమ్మాపూర్, జనవరి 8: కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం ఎల్ఎండీ కాలనీలోని ఇంటిగ్రేటెడ్ హాస్టల్లో ఐదుగురు విద్యార్థులు కిచిడీ, చారు తిని అస్వస్థతకు గురయ్యారు. ఎల్ఎండీ కాలనీలోని ఎస్సీ బాలికల వసతి గృహంలో ఉంటూ పక్కనే ఉన్న జడ్పీ ఉన్నత పాఠశాలలో విద్యార్థినులు చదువుకుంటున్నారు. వీరు బుధవారం హాస్టల్లో టిఫిన్ చేసి స్కూల్కు వెళ్లారు. అక్కడ మధ్యాహ్నం భోజనం చేసి, మళ్లీ సాయంత్రం హాస్టల్కు వచ్చారు. కిచిడీ, చారుతో భోజనం చేశారు. ఈ క్రమంలో ఐదుగురు విద్యార్థులకు విరేచనాలు కావడంతో స్థానికంగా మందులు వేయించారు. అందులో 8,9వ తరగతి చదువుతున్న ముగ్గురు విద్యార్థినులు అరణ్య, కళ్యాణి, నందినికి తీవ్రంగా విరేచనాలు కావడంతోపాటు కడుపు నొప్పి రావడంతో హాస్టల్ సిబ్బంది కరీంనగర్ దవాఖానకు తరలించి చికిత్స అందిస్తున్నారు. హాస్టల్ ఫుడ్ వల్ల అస్వస్థత కలుగలేదని, పాఠశాలలో తిన్న భోజనం వల్లే విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారని హాస్టల్ సిబ్బంది చెప్తున్నారు. విషయం తెలుసుకుని విద్యార్థినుల తల్లిదండ్రులు దవాఖానకు చేరుకుని ఆందోళన చెందారు. మిగిలిన విద్యార్థుల తల్లిదండ్రులు సైతం క్షేమ సమాచారం తెలుసుకున్నారు.