PG Medical Colleges | హైదరాబాద్, జూన్ 28 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో ఐదు కొత్త పీజీ మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తున్నది. ఈ ఏడాది నుంచి జాతీయ వైద్య మండలి (ఎన్ఎంసీ) యూజీ లేకుండా నేరుగా పీజీ మెడికల్ కాలేజీలో ఏర్పాటుకు పచ్చ జెండా ఊపింది. ఈ క్రమంలో రాష్ట్రంలో కింగ్ కోఠి, మిర్యాలగూడ, భద్రాచలం, బాన్సువాడ, పెద్దపల్లిలో ప్రభుత్వ పీజీ మెడికల్ కాలేజీలో ఏర్పాటుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ప్రాంతాల్లో 200 పడకలతో ఉన్న దవఖానాలను పీజీ కోర్సుల కోసం బోధనసుపత్రులుగా మార్చనున్నారు. ఎంబిబిఎస్ తర్వాత పిజి చదివితేనే ప్రభుత్వ, ప్రైవేటు దవాఖానాల్లో డిమాండ్ ఉండడంతో యూజీ తర్వాత పీజీ చేసేందుకు వైద్య విద్యార్థులు మొగ్గు చూపుతున్నారు. మరోవైపు రాష్ట్రంలో 1:4 నిష్పత్తిలో పీజీ వైద్య విద్య సీట్ల కొరత నెలకొంది. ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో పీజీ సీట్ల సంఖ్యను పెంచాలని వైద్య విద్యార్థులు గత కొన్ని రోజులుగా ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఈ నేపథ్యంలో ఆరోగ్య శాఖ మంత్రి ఇటీవల రాష్ట్రంలో పర్యటించిన ఎన్ఎంసీ చైర్మన్ దృష్టికి ఈ సమస్యను తీసుకువెళ్లారు. పీజీ సీట్ల పెంపుతో మారు మూల ప్రాంతాల్లో సైతం మెరుగైన వైద్య సేవలు అందనున్నాయి.