హైదరాబాద్: రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో (Hyderabad) శాంతి భద్రతలు క్షీణిస్తున్నాయి. రోజురోజుకు హింసాత్మక ఘటనలు పెరిగిపోతున్నాయి. హత్యతలు, హత్యాయత్నాలు ప్రతిరోజూ వెలుగుచూస్తూనే ఉన్నాయి. ఇలా గత 24 గంటల్లోనే నగరంలో ఐదు హత్యలు, రెండు హత్యాయత్నాలు చోటుచేసుకున్నాయి. పాతబస్తి శాలిబండలో నిమ్రా ఫాస్ట్‌ఫుడ్ యజమాని దారుణ హత్యకు గురయ్యారు. తుకారాంగేట్‌లోని అడ్డగుట్టలో కట్టున్న భార్యను భర్త కడతేర్చాడు. అదేవిధంగా అసిఫ్‌నగర్‌లో అలీం అనే వ్యక్తిని గుర్తుతెలియని వ్యక్తులు హత్యచేశారు. ఇక కాచిగూడ రైల్వే స్టేషన్లో ఖిజార్ అనే వ్యక్తిని దుండగలు నరికి చంపేశారు. గురువారం ఉదయం సనత్‌నగర్‌లోని భరత్‌నగర్‌లో అజార్ అనే యువకుడు హత్యకు గురయ్యాడు. శాలిబండలో వజీద్, ఫకృద్ధీన్ అన్ వ్యక్తులపై దుండగులు హత్యాయత్నం చేశారు.
ఇలా ఒక్క రోజులోనే ఐదుగురు హత్యకు గురికావడంతో నగరవాసులు భయాందోళనలకు గురవుతున్నారు. ఎప్పుడు ఏం జరుగుతుందోనని వణికిపోతున్నారు. కాగా, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన ఆరు నెలల్లోనే మూడు సార్లు పోలీసు అధికారులను బదిలీ చేసింది. దీంతో శాంతి భద్రతలపై అధికారులు దృష్టిసారించలేకపోతున్నారు. కాగా, నాలుగు రోజుల క్రితంకూడా నగరంలో మూడు హత్యలు జరిగిన విషయం తెలిసిందే.