హైదరాబాద్, జూలై 21 (నమస్తే తెలంగాణ) : బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం, రుతుపవన ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో వచ్చే ఐదురోజులు మోస్తరు నుంచి భారీ, అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం సోమవారం ఒక ప్రకటనలో తెలిపింది. ఈనెల 24న ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నదని హెచ్చరించింది. మంగళ, బుధవారాల్లో ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి, కరీంనగర్, జగిత్యాల, రాజన్నసిరిసిల్ల, పెద్దపల్లి, మెదక్, సిద్దిపేట, జనగామ, వరంగల్, హనుమకొండ, జయశంకర్ భూపాలపల్లి, మహబూబాబాద్, ములుగు, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, నల్లగొండ తదితర జిల్లాలలో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఉరుములు, మెరుపులతోపాటు గంటకు 30-40 కిలో మీటర్ల ఈదురుగాలులతో వర్షాలు అన్ని జిల్లాల్లో కురిసే అవకాశం ఉన్నదని పేర్కొన్నది.
దీంతో ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసినట్టు వివరించింది. గడిచిన 24 గంటల్లో నల్లగొండ, మహబూబ్నగర్, నాగార్కర్నూల్, నారాయణపేట జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసినట్టు వెల్లడించింది. అత్యధికంగా నల్లగొండ జిల్లా ముల్కలపల్లిలో 10.08 సెంటీ మీటర్ల వర్షపాతం నమోదు కాగా, గుర్రంపోడులో 6.28 సెంటీ మీటర్లు, వరంగల్ జిల్లా మంగళవారిపేటలో 8.83 సెంటీ మీటర్లు మేడపల్లెలో 7.60 సెం.మీ, నల్లబెల్లిలో 6.93 సెం.మీ, చెన్నారావుపేటలో 6.03 సెం.మీ, మహబూబాబాద్ జిల్లా భూపతిపేటలో 7.05 సెం.మీ, సిద్దిపేట జిల్లా కోహెడలో 6.23 సెం.మీ, ఖమ్మం జిల్లా చింతకానిలో 6.18 సెం.మీ, రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో 5.95 సెం.మీ వర్షపాతం నమోదైనట్టు వెల్లడించింది. అతి భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అధికారులు ప్రజలను అప్రమత్తం చేయాలని సూచించింది.