హైదరాబాద్, డిసెంబర్ 2 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో తొలి విడత పంచాయతీ ఎన్నికల్లో సగటున ఒక్కో సర్పంచ్ స్థానానికి ఐదుగురు చొప్పున బరిలో నిలిచారు. ఆయా పంచాయతీల్లోని వార్డు స్థానాల్లో మాత్రం అత్యధికంగా ముఖాముఖి పోటీయే నెలకొన్నది. 4,231 సర్పంచ్ స్థానాలకు 22,041 మంది అభ్యర్థులు పోటీలో ఉండగా, సగటున ఒక్క సీటు కోసం 5.2 మంది బరిలో ఉన్నట్టు తేలింది. 37,307 వార్డులకు 85,328 మంది పోటీలో నిలిచారు. నామినేషన్ల ఉపసంహరణకు బుధవారం నాటికి అవకాశం ఉన్నది. మరికొంత మంది నామినేషన్లను ఉపసంహరించుకున్నా.. కొద్దిగా తేడా ఉండొచ్చని రాష్ట్ర ఎన్నికల సంఘం విడుదల చేసిన గణాంకాలను బట్టి తెలుస్తున్నది.
తొలి విడతలో దాఖలైన నామినేషన్లను ఎస్ఈసీ అధికారులు పరిశీలించారు. చెల్లుబాటైన నామినేషన్ల వివరాలను వెల్లడించారు. మరో ఐదు పంచాయతీల్లో సర్పంచ్, వివిధ జిల్లాల్లోని 133 వార్డు స్థానాలకు నామినేషన్లు దాఖలు కాలేదు. కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలో ఒక పంచాయతీ, 30 వార్డులకు, మంచిర్యాల జిల్లాలో 34 వార్డులకు, వికారాబాద్ జిల్లాలో 19 వార్డులకు, జనగామ జిల్లాలో 10 వార్డులకు, నిర్మల్ జిల్లాలో 7 వార్డులకు, నిజామాబాద్ జిల్లాలో ఐదు వార్డులు, ములుగు జిల్లాలో 4 వార్డులకు, మరికొన్ని జిల్లాల్లో కలిపి 133 వార్డులకు నామినేషన్లు దాఖలు కాలేదు.
తొలి విడత పంచాయతీ ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థులకు రిటర్నింగ్ అధికారులు (ఆర్వోలు) బుధవారం గుర్తులను కేటాయిస్తారు. ఇదేరోజు మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం ఉన్నది. అనంతరం బరిలో నిలిచిన వారి తుది జాబితాను విడుదల చేసి, గుర్తులను కేటాయిస్తారు. వీరంతా బుధవారం సాయంత్రం నుంచి 9వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు ప్రచారం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది.
పంచాయతీ ఎన్నికల్లో తుది విడత ఎన్నికలకు నామినేషన్ల ప్రక్రియ బుధవారం నుంచి మొదలవుతుంది. ఈ మేరకు రాష్ట్రంలోని 31 జిల్లాలు 182 మండలాల్లోని 4,159 గ్రామ పంచాయతీలు, 36,452 వార్డు స్థానాల నామినేషన్ల ప్రక్రియకు రిటర్నింగ్ అధికారులు నోటీసులు జారీచేశారు. వార్డులవారీగా పంచాయతీ ఓటర్ల జాబితాలను అధికారులు ఆయా పంచాయతీ కార్యాలయాల వద్ద ప్రదర్శిస్తారు. బుధవారం నుంచి శుక్రవారం సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్లను స్వీకరిస్తారు. నామినేషన్ల పరిశీలన, అభ్యర్థుల జాబితా ప్రకటన, అప్పీళ్ల స్వీకరణ, పరిష్కారం, ఉపసంహరణ, అభ్యర్థుల తుదిజాబితా ప్రకటన వంటి ప్రక్రియ ఈ 9వ తేదీ వరకు ముగుస్తాయి. వారంపాటు ప్రచారం అనంతరం 17న ఉదయం 7 నుంచి ఒంటిగంట వరకు పోలింగ్ జరుగుతుంది.
హైదరాబాద్, డిసెంబర్ 2 (నమస్తే తెలంగాణ): ఆదివారం మొదలైన రెండో విడత పంచాయతీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ మంగళవారం ముగిసింది. మూడో రోజు భారీ సంఖ్యలో నామినేషన్లు వేసేందుకు రిటర్నింగ్ కార్యాలయాల ఎదుట అభ్యర్థులు బారులు తీరారు. 4,332 సర్పంచ్ స్థానాలకు తొలిరోజు 2,976, రెండో రోజు 9,503 నామినేషన్లు దాఖలయ్యాయి. 38,342 వార్డులకు తొలిరోజు 3,602 నామినేషన్లు, రెండోరోజు 26,438 నామినేషన్లు వచ్చా యి. నామినేషన్లను బుధవారం పరిశీలించి చెల్లుబాటయ్యే అభ్యర్థుల జాబితాను సాయంత్రం 5 గంటల తర్వాత ప్రకటిస్తారు. తిరస్కరణకు గురైన నామినేషన్లపై అభ్యర్థులు అప్పీళ్లకు వెళ్లవచ్చు.
4వ తేదీన అప్పీల్ చేసుకుంటే, 5న పరిష్కరిస్తారు. 6న మూడు గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం. ఆ తర్వాత పోటీలో నిలిచిన అభ్యర్థుల తుది జాబితాను ప్రకటిస్తారు. ప్రచారానికి 8 రోజుల గడువు ఉంటుంది. 14న ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ ఉంటుంది. మధ్యాహ్నం 2 గంటల తర్వాత ఓట్ల లెక్కింపు ప్రక్రియ పూర్తయిన వెంటనే ఫలితాలను ప్రకటిస్తారు. మరోవైపు మూడో/తుది విడతకు సంబంధించిన నామినేషన్ల ప్రక్రియ బుధవారం నుంచి మొదలు కానున్నది.