జనగామ: జనగామ (Jangaon) జిల్లాలో దారుణం జరిగింది. పునరావాస కేంద్రం నుంచి పారిపోయిన ఇద్దరు మైనర్లపై ఐదుగురు యువకులు లైంగికదాడికి పాల్పడ్డారు. జనగామ ప్రాంతానికి చెందిన బాలిక (14), మల్కాజిగిరికి చెందిన బాలిక(15) ఇద్దరికీ తల్లిదండ్రులున్నారు. అయితే వివిధ కారణాలతో వారిని హైదరాబాద్ సైదాబాద్‌లోని పునరావాస కేంద్రంలో చేర్పించారు. ఈ క్రమంలో బాలికల మధ్య స్నేహం పెరిగి.. పారిపోవాలని పథకం వేశారు. ఇద్దరు కలిసి జనగామ వెళ్లారు. అయితే బాలికల్లో ఒకరు బస్టాండ్ సమీపాన పాన్ షాప్ నిర్వాహకుడు సాయిదీప్ దగ్గర ఫోన్ తీసుకుని తనకు పరిచయస్థుడైన నాగరాజుకు ఫోన్ చేసింది. అతడు వచ్చి ఆశ్రయం కల్పిస్తానంటూ తీసుకెళ్లి దారుణానికి పాల్పడ్డాడు.
బస్టాండు వద్దే మరో బాలిక ఒంటరిగా ఉండిపోవడాన్ని గమనించిన సాయిదీప్.. పక్కనే ఉన్న బేకరీకి తీసుకెళ్లాడు. అక్కడ బేకరీ నిర్వాహకుడు రాజు, ఇతర స్నేహితులు అఖిల్, రోహిత్ హైదరాబాద్ తీసుకెళ్తామంటూ.. కారులో వేర్వేరు ప్రాంతాల్లో తిప్పుతూ లైంగిక దాడికి పాల్పడి తిరిగి బస్టాండ్ దగ్గర వదిలిపెట్టారు. బాలికలు తమపై లైంగిక దాడి జరిగిందని అధికారులకు తెలడంతో వారు.. పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోక్సో కేసు నమోదుచేసిన సైదాబాద్ పోలీసులు ఐదుగురు యువకులను అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించారు.