దస్తురాబాద్, నవంబర్ 4 : నిర్మల్ జిల్లా దస్తురాబాద్ మండల కేంద్రంలోని రెండు చెరువుల్లో సోమవారం రాత్రి చేప పిల్లలను మత్స్యకారులు, కూలీలు, ఫీల్డ్మెన్ రవి వదిలారు. మత్స్యశాఖ అధికారులు, ప్రజాప్రతినిధులు రాకపోవడం విమర్శలకు తావిస్తున్నది. రెండు చెరువుల్లో కట్ల, రవ్వు, మెరిగల రకాల 43 వేల చేప పిల్లలను వదిలారు. చెరువుల వద్ద మత్స్యకారులు చేప పిల్లల కోసం ఎదురు చూడగా రాత్రి వేళ అధికారులు పంపిణీ చేశారు. చేప పిల్లలు నాసిరకంగా ఉండటంతో కొన్ని మృత్యువాత పడ్డాయి. మండల ప్రత్యేక అధికారి రాజేశ్వర్గౌడ్ను వివరణ కోరగా.. మత్స్యశాఖ అధికారులు తమకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదని తెలిపారు.