హైదరాబాద్, జనవరి 17 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో మత్స్యరంగం తిరోగమనంలో పయనిస్తున్నది. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉచిత చేపపిల్లల పంపిణీ పథకాన్ని కాంగ్రెస్ సర్కారు నీరుగార్చింది. 2024-25లో రాష్ట్రవ్యాప్తంగా 84 కోట్ల ఉచిత చేపపిల్లలను ఉచితంగా పంపిణీ చేయాలని లక్ష్యంగా నిర్ణయించిన రేవంత్‌రెడ్డి సర్కారు.. చెరువుల్లో కేవలం 29 కోట్ల పిల్లలనే విడుదల చేసింది. ఆ కార్యక్రమాన్ని కూడా సకాలంలో నిర్వహించకపోవడంతో చేపపిల్లలు సరిగ్గా పెరగక మత్స్యకారులు తీవ్రంగా నష్టపోయారు. అయినప్పటికీ గుణపాఠం నేర్చుకోని రాష్ట్ర ప్రభుత్వం ఈసారి కూడా సీజన్ ముగిసి 6 నెలలైనా చెరువుల్లో చేపపిల్లలను పూర్తిస్థాయిలో వదల్లేదు.
దీంతో మత్స్యకార కుటుంబాలు తీవ్ర ఆందోళన చెందుతున్నాయి. రాష్ట్రంలో మత్స్య పరిశ్రమ అభివృద్ధి కోసం కార్పొరేషన్‌ను ఏర్పాటు చేస్తామంటూ ఎన్నికల మ్యానిఫెస్టోలో కాంగ్రెస్ ఇచ్చిన హామీని రేవంత్‌రెడ్డి సర్కారు మూలన పడేసింది. మత్స్య సహకార సంఘాల సమాఖ్యకు ఎన్నికలు నిర్వహించి, రాష్ట్రస్థాయిలో పాలక మండలిని నియమించాలన్న హైకోర్టు ఆదేశాలను సైతం పట్టించుకోని కాంగ్రెస్ సర్కారు.. 2023-24లో చేపపిల్లలు సరఫరా చేసిన కాంట్రాక్టర్లకు చెల్లించాల్సిన రూ.91 కోట్ల బకాయిల్లో రూ.35 కోట్లు మాత్రమే చెల్లించింది. 2024-25కు సంబంధించిన రూ.21 కోట్ల బకాయిలను ఇంతవరకూ చెల్లించకపోవడంతో 2025-26లో చేపపిల్లలను సరఫరా చేసేందుకు కాంట్రాక్టర్లు ముందుకురాలేదు. దీంతో ప్రభుత్వం ఈసారి చెరువుల్లో తూతూ మంత్రంగా చేపపిల్లలను విడుదల చేయడంతో వరుసగా రెండో ఏడాది మత్స్యకారుల ఉపాధి ప్రశ్నార్థకంగా మారింది.
మత్స్యకారుల భవిష్యత్తుకు నాడు కేసీఆర్ భరోసా
గతంలో కేసీఆర్ ప్రభుత్వం ఎనిమిదేండ్లపాటు ఉచిత చేపపిల్లల పంపిణీ పథకాన్ని అమలు చేసింది. 2016-17లో 27.85 కోట్లు, 2023-24లో అత్యధికంగా 76.61 కోట్ల చేపపిల్లలను పంపిణీచేసి మత్స్యకారులకు భరోసా కల్పించింది. నాడు చేపట్టిన ‘మిషన్ కాకతీయ’ పథకం విజయవంతమై చెరువుల్లో నీటి నిల్వలు పెరగడంతో చేపతల ఉత్పత్తి రెట్టింపై మత్స్యకారుల ఆదాయం పెరిగింది. కానీ, గత ఏడాది (2024-25) 84 కోట్ల చేపపిల్లలను పంపిణీ చేయాలని లక్ష్యంగా నిర్ణయించుక్ను ప్రభుత్వం కేవలం 29.25 కోట్ల చేపపిల్లలను మాత్రమే పంపిణీ చేసింది. ఈ సంవత్సరం (2025-26) రూ.122 కోట్లతో 24 వేల చెరువుల్లో 83 కోట్ల చేప పిల్లలను, మరో రూ.24 కోట్లతో 10 కోట్ల రొయ్యపిల్లలను పంపిణీ చేయాలని లక్ష్యం పెట్టుకున్న రేవంత్‌రెడ్డి సర్కారు.. ఇంతవరకూ కేవలం 51 కోట్ల చేపపిల్లలు, 1.40 కోట్ల రొయ్య పిల్లలను మాత్రమే పంపిణీ చేసింది.