షాద్‌నగర్, ఆగస్టు 26: మత్స్య సంపద చేతికి వచ్చే సమయంలో కాలుష్యం కబళించింది. కొన్నాళ్లుగా పరిశ్రమల నుంచి వెలువడుతున్న కాలుష్య జలాలతో చెరువులు కలుషితం అవుతున్నాయని ప్రజలు ఆరోపిస్తున్నా పరిశ్రమ యజమాన్యం పట్టించుకోలేదు. ఫలితంగా వేల రూపాయల విలువ చేసే మత్స్య సంపద కలుషిత నీళ్లలో మునిగిపోయింది. షాద్‌నగర్ మున్సిపాలిటీ పరిధిలోని చటాన్‌పల్లిలో ఉన్న సూరసముద్రం చెరువులో కొన్నాళ్లుగా మత్స్యకారులు చేపలను పెంచుతూ జీవనోపాధి పొందుతున్నారు. సోమవారం ఉదయం చెరువుకు వచ్చిన మత్స్యకారులకు కుప్పలు తెప్పలుగా మృతిచెందిన చేపలు కనిపించాయి. చెరువు సమీపంలోని ‘ప్రయాగ్’ చాక్లెట్ పరిశ్రమ నుంచి వచ్చిన కలుషిత జలాల వలనే చేపలు మృతి చెందాయని గుర్తించారు. గతంలో కూడా కలుషిత జలాలతో చేపలు మృతిచెందాయని, అయినా పరిశ్రమ నిర్వాహకులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తూ పరిశ్రమ ఎదుట ధర్నా చేశారు. ఇటీవలనే 5 లక్షల చేప పిల్లలను వదిలామని, ప్రస్తుతం 30 లక్షల చేపలు చేతికి వచ్చే అవకాశం ఉందని చెప్పారు. పరిశ్రమ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. విషయాన్ని తెలుసుకున్న పరిశ్రమ యాజమాన్యం బాధితులకు పరిహారం ఇస్తామని హామీ ఇచ్చింది.